వాటిని ఉపసంహరించుకోండి ప్లీజ్!

March 17, 2017


img

రాష్ట్ర సాగునీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ నేతలకు చేసిన విజ్ఞప్తిపై స్పందించడం వారికి చాలా ఇబ్బందికరంగా మారింది.  శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, నల్లగొండ జిల్లాలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పధకానికి అవరోధం సృష్టిస్తున్నది కాంగ్రెస్ నేతలే అని మాకు తెలుసు. మా ప్రభుత్వం ఆ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి పంటలకు నీళ్ళు అందించాలని ప్రయత్నిస్తుంటే, మీరు జివో నెంబర్: 123 క్రింద భూసేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. మీరు రైతుల మేలు కోరుకొంటున్నట్లయితే తక్షణమే ఆ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆ పని చేస్తే మేము కేవలం 10 నెలలోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తాము,” అని అన్నారు. 

భూసేకరణ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బదులిస్తూ, “భూసేకరణ చట్టం:2013 ప్రకారమే భూసేకరణ చేయాలని మీరు పట్టుపడుతున్నారు. కానీ మన దేశంలో ఇంతవరకు ఎక్కడా ఆ చట్టం క్రింద భూసేకరణ జరుగలేదని మీరు గ్రహించాలి. ఉదయ సముద్రం కోసం మేము జివో నెంబర్: 123 క్రింద 140 ఎకరాలు భూసేకరణ చేశాము. కాంగ్రెస్ నేతలు సహకరిస్తే ప్రాజెక్టును పూర్తిచేయగలుగుతాము,” అని మంత్రి హరీష్ రావు అన్నారు. 

హరీష్ రావు చెప్పిన మాటలలో రెండు ప్రధానమైన అంశాలు కనబడుతున్నాయి. 1. కాంగ్రెస్ నేతలు కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని చెప్పడం. 2. భూసేకరణ చట్టం:2013 ప్రకారం భూసేకరణ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పడం. 

ఒకవేళ ఆయన విజ్ఞప్తిపై కాంగ్రెస్ నేతలు సానుకూలంగా స్పందించినట్లయితే, వారు ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుపడుతున్నారని శాసనసభ సాక్షిగా అంగీకరించినట్లవుతుంది. కనుకనే వారు స్పందించలేదనుకోవలసి ఉంటుంది. 

మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణ సమయంలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు, రైతులు   భూసేకరణ చట్టం:2013 ప్రకారమే భూములు ఇవ్వదలచుకొంటే అలాగే తీసుకొంటామని, లేదా జివో నెంబర్: 123 ప్రకారం నష్టపరిహారానికి అంగీకరిస్తే అలాగే చెల్లించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు భూసేకరణ చట్టం:2013 ప్రకారం భూసేకరణ సాధ్యం కాదన్నట్లు మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 


Related Post