అధికారం వాళ్ళకి...భారం సామాన్యులకి!

March 17, 2017


img

‘అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చింది’ అన్నట్లుంది కేంద్రప్రభుత్వం వ్యవహారం. పంట రుణాల మాఫీ హామీని నిలబెట్టుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ సహకారం కోరినప్పుడు 'అటువంటి హామీలు ఇవ్వడం చాలా బుద్ధి తక్కువ. కానీ ఇచ్చారు కనుక ఆ భారం మీరే భరించుకోండని' నిర్మొహమాటంగా కేంద్రప్రభుత్వం చెప్పేసింది. ఇతరులకు బుద్ధి లేదని విమర్శించిన కేంద్రం కూడా అదే తప్పు చేసింది.

యూపి ఎన్నికలలో భాజపా కూడా ‘పంట రుణాలు మాఫీ' హామీ మంత్రం పటించి గెలిచేసింది. అందుకు భాజపాను తప్పు పట్టలేము. భాజపా హామీ ఇచ్చింది కనుక యూపిలో అధికారంలోకి వస్తున్న భాజపా ప్రభుత్వమే వాటిని తీర్చుకోవలసిన బాధ్యత ఉంది. కానీ వాటిని కేంద్రప్రభుత్వమే తీరుస్తుందని కేంద్ర వ్యవసాయమంత్రి రాధా మోహన్ సింగ్ నిన్న పార్లమెంటులో చెప్పడం ఆలోచించవలసిన విషయమే. యూపిలో భాజపా ప్రభుత్వం ఏర్పడబోతోంది కనుక దానికి ఆర్ధిక సహాయం చేయడానికి కేంద్రప్రభుత్వం సిద్దం అవుతోంది. బాగానే ఉంది. ఒకవేళ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా తమకు కూడా రుణాల మాఫీకు ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తే అప్పుడు కేంద్రప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వకపోతే వాటికి ఏమని సమాధానం చెపుతుంది?

దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఎంత ఇచ్చినా...ఏమి చేసినా తప్పు కాదు. కానీ రాజకీయ పార్టీలు అధికారం రావడం కోసం వారి బలహీనతను సొమ్ము చేసుకోవాలనుకోవడమే తప్పు. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చే హామీలకు ఆ రాష్ట్ర ప్రజలు లేదా యావత్ దేశ ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి? అనే సామాన్యుడి ప్రశ్నకు సమాధానం దొరకదు.

అలాగే మోడీ మానస పుత్రికగా చెప్పబడుతున్న జనధన్ ఖాతాల నిర్వహణ బ్యాంకుల మెడకు గుదిబండలాగ మారిందని చెపుతూ, ఆ గుదిబండను సామాన్య ఖాతాదారుల మెడకు చుట్టేసి బ్యాంకులు తప్పించుకొంటున్నా ఏమీ చేయలేని నిసహ్హాయ స్థితి నెలకొని ఉంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు..వాటిని నడుపుతున్న రాజకీయ పార్టీలు చేసే తప్పులకు, తప్పుడు నిర్ణయాలకు సామాన్య ప్రజలు మౌనంగా మూల్యం చెల్లించవలసిరావడం చాలా శోచనీయం. అయినా ప్రజలు వారిని అడగలేని నిసహాయత...అధికారంలో ఉన్నవారు ఎవరూ వాటికి జవాబుదారికాకపోవడం ఇంకా విచారకరం. 


Related Post