రోజా సస్పెన్షన్: దొందూ దొందే!

March 17, 2017


img

వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా తెదేపా ఎమ్మెల్యే అనిత పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఏడాదిపాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. ఏడాది సస్పెన్షన్ గడువు ముగియడం మళ్ళీ ఆమె వెలగపూడిలో శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ ఈ వ్యవహారంపై విచారణ కోసం వేసిన ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకాకుండా తప్పించుకొని ఆమె కుంటిసాకులు చెపుతూ తిరుగుతుండటంతో నేటికీ ఆమె తను చేసిన తప్పుకు పశ్చాతాపపడటం లేదని భావించిన కమిటీ ఆమెపై మరొక ఏడాదిపాటు సస్పెన్షన్ విదించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సిఫార్సు చేసింది. ఆ లేఖను నిన్న ఏపి శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు రోజా మళ్ళీ సభకు డుమ్మా కొట్టారు. కనుక ఆమెపై సస్పెషన్ వేటు అనివార్యంగానే కనిపిస్తోంది. 

ఈ వ్యవహారంలో తెదేపా ప్రభుత్వం, రోజా ఇద్దరూ చాలా అతిగానే ప్రవర్తిస్తున్నారని చెప్పకతప్పదు. తోటి శాసనసభ్యురాలి పట్ల రోజా ఆవిధంగా అనుచితంగా వ్యవహరించడం చాలా తప్పే. కానీ రోజా పట్ల కూడా తెదేపా సభ్యులు అనుచితంగానే ప్రవర్తించారు. 

తెదేపా ప్రభుత్వం ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ విదించింది. కనుక ఈ వ్యవహారం అక్కడితో ముగిసిపోయినట్లే భావించవలసి ఉంటుంది. కానీ ఆమె కమిటీ ముందు హాజరుకాలేదని, కమిటీకి గందరగోళ సమాధానాలు చెప్పారనే నెపంతో మళ్ళీ ఆమెపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్ విదించాలనుకోవడం కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తోంది. 

ఇక రోజా కూడా గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తీసుకువచ్చారని చెప్పకతప్పదు. ఆ సంఘటన జరిగినరోజే స్పీకర్ కు క్షమాపణలు చెప్పి ఉండి ఉంటే ఈ సమస్య అప్పుడే సమసిపోయుండేది. కానీ రాజకీయ కారణాలతో దానిని ఇంతవరకు తీసుకు వచ్చారు. ఆమె తీరు చూస్తుంటే శాసనసభ నుంచి సస్పెండ్ చేసినందుకు ఏమాత్రం బాధపడుతున్నట్లు లేదు. ప్రభుత్వం, రోజా ఇద్దరి తీరు చూస్తుంటే దొందూ దొందే అన్నట్లుంది. 


Related Post