తెరాస సర్కార్ ను మెచ్చుకోవాలని ఉంటుంది కానీ..

March 16, 2017


img

“తెరాస సర్కార్ చేస్తున్న మంచి పనులను మెచ్చుకోవాలని ఉంటుంది కానీ వాటికి మీడియా తప్పు అర్ధాలు తీస్తుంటుంది. నేను తెరాసలో చేరడానికి ప్రయత్నిస్తున్నానని వ్రాసి పడేస్తాయి. అందుకే తెరాస సర్కార్ చేసే మంచి పనులను బహిరంగంగా మీడియా ముందు మెచ్చుకొంటూ మాట్లాడలేకపోతున్నాను.” ఈ మాటలు అన్నది సీనియర్ కాంగ్రెస్ నేత, శాసనమండలిలో ప్రధానప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలి. 

ఈరోజు శాసనమండలిలో సాగునీటి ప్రాజెక్టులపై ఆ శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు క్రింద వచ్చే ఎస్.ఆర్.ఎస్.పి. వరదనీటి కాలువను నిజాం సాగర్ ప్రాజెక్టుతో అనుసంధానం చేయడం ద్వారా ఆ ప్రాంతపు రైతులకు తీవ్ర వర్షాభావ పరిస్థితులలో కూడా పంటలకు నీళ్ళు అందుతాయి. మా ఈ ఆలోచనను ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ కూడా మెచ్చుకోవడం మాకు చాలా సంతోషం కలిగిస్తోంది. దీని కోసం రూపొందించిన నివేదికను త్వరలోనే మంత్రివర్గం ఆమోదించగానే పనులు మొదలుపెడతాము,” అని అన్నారు. దానికి బదులుగా షబ్బీర్ అలీ ఆవిధంగా స్పందించారు. తెరాస సర్కార్ మంచిపనులు చేస్తే తాను ఎప్పుడూ సమర్దిస్తానని అన్నారు. కానీ మీడియాకు జడిసే కొన్ని పైకి చెప్పలేమని అన్నారు. 

మంత్రి హరీష్ రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, “నిజాంసాగర్ ప్రాజెక్టుఆధునీకరణ పనులకు మొత్తం రూ.954.77 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. దానిలో రూ. 742. 824 కోట్లు మా ప్రభుత్వం మంజూరు చేసింది. దానిలో ఇంతవరకు రూ. రూ.576 కోట్లు ఖర్చు చేసి పనులను ఒక కొలిక్కి తీసుకువచ్చాము. మొట్టమొదటిసారిగా దీని క్రింద సాగవుతున్న 2.1 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందిస్తున్నాము. కేంద్రప్రభుత్వం వాటాగా రూ.100 కోట్లు అందవలసి ఉంది. అది కూడా అందితే ఈ జూన్ నాటికి  మొత్తం పనులన్నీ పూర్తయిపోతాయి,” అని అన్నారు.


Related Post