పంట రుణాల మాఫీ..వెరీ బ్యాడ్

March 16, 2017


img

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య నిర్మొహమాటంగా మాట్లాడుతుంటారు. ముంబైలో నిన్న జరిగిన సిఐఐ సదస్సులో ఆమె మాట్లాడుతూ, “పంట రుణాలు మాఫీ చేయడం సరికాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం పంట రుణాల మాఫీ చేసినట్లయితే, మళ్ళీ మరోసారి చేయకపోతుందా..అనే ఆశ రైతులకు కలగడం సహజం. అప్పుడు వారు రుణాలు చెల్లించడానికి వెనకాడవచ్చు. దాని వలన ఈ రుణాల మంజూరు, చెల్లింపుల ప్రక్రియ అస్తవ్యస్తం అవుతుంది. అప్పుడు బ్యాంకులు, రైతులు కూడా తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడు ప్రభుత్వం వారి రుణాలను చెల్లిస్తుంది కనుక బ్యాంకులు ఒడ్డున పడతాయి కానీ మళ్ళీ మేము రైతులకు రుణాలు ఇచ్చినప్పుడు వారు తిరిగి చెల్లించకపోతే అప్పుడు వాటిని ఎవరు తీరుస్తారు? ఒకవేళ వాళ్ళు తీర్చకపోతే బ్యాంకుల పరిస్థితి ఏమిటి? కనుక పంట రుణాల మాఫీ చేయడం మంచి సాంప్రదాయం కాదు,” అని అన్నారు. 

ఆమె చెప్పింది నిజమేనని అందరూ అంగీకరిస్తారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో రైతులను ఆకట్టుకొని అధికారంలోకి రావడానికి ఇటువంటి హామీలు ఇవ్వడం, తరువాత ఆ హామీలే వాటి మెడకు గుదిబండలాగ మారడంతో ఆ భారం తగ్గించుకోవడానికి, రైతులకు ఎంతో కొంత చెల్లించేసి ‘మమ’ అని వదిలించుకోవడానికి చాలా ఆపసోపాలు పడుతుండటం చూస్తూనే ఉన్నాము. అంటే బ్యాంకులు, రైతులే కాదు ప్రభుత్వాలు కూడా వాటి వలన ఇబ్బందులు పడుతున్నయన్నమాట. కనుక రాజకీయ పార్టీలు అటువంటి ఆలోచనలు చేయకుండా ఉంటేనే మంచిది. దీనిలో కష్టనష్టాల గురించి తెలిసి ఉన్నప్పటికీ భాజపా కూడా యూపి ఎన్నికలలో పంట రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి గెలిచింది. దానిని దృష్టిలో పెట్టుకొనే ఆమె ఈవిధంగా అన్నారని అర్ధం అవుతోంది. 

పంట రుణాల మాఫీ సరికాదని ఆమె చెపుతున్నపుడు ప్రభుత్వం ఒత్తిడి కారణంగా విజయ్ మాల్యా వంటి ఆర్ధిక నేరగాళ్లకు వేల కోట్లు రుణాలు ఇచ్చేసి, అవి వసూలుచేసుకోలేని పరిస్థితిలో వాటిని మొండి బకాయిల పద్దులో రాసేసుకొని మాఫీ చేయడం గురించి కూడా ఆమె ఇంతే నిష్కర్షగా మాట్లాడి ఉండి ఉంటే బాగుండేది. దేశంలో పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు బ్యాంకులకు లక్షల కోట్లు రుణాలు తిరిగి చెల్లించవలసి ఉందని గణాంకాలు చెపుతున్నాయి. రాజకీయ పలుకుబడి కలిగిన కార్పోరేట్ సంస్థలపై ఒత్తిడి తెచ్చి ఆ రుణాలను వసూలు చేసుకోలేకపోతున్న బ్యాంకులు, నోరు లేని సామాన్య ప్రజలపై ఆ భారం మోపడమే కాక వారికి ఎటువంటి మినహాయింపులు ఇవ్వడం సరికాదని ఈవిధంగా చెపుతున్నాయి. నిజమే..పంట రుణాల మాఫీని సమర్ధించలేము. కానీ మన బ్యాంకులు అదే నిబందనను విజయ్ మాల్యా వంటి ఆర్ధిక నేరగాళ్లకు కూడా ఎందుకు వర్తింపజేయలేకపోతున్నాయి? అనేదే సామాన్యుడి ప్రశ్న. 


Related Post