మూడేళ్ళలోనే ఇన్ని సమస్యలా?

March 15, 2017


img

ఆంధ్రా పాలకుల చెర నుంచి తెలంగాణా రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి లభించిందని సంతోషిస్తుంటే, మళ్ళీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు మద్య భీకర రాజకీయ యుద్దాలు చాలా ఆందోళనకరంగా మారాయి. వారు విమర్శలు విధానాలకే పరిమితం అయితే దాని వలన ఎవరికీ నష్టం ఉండేది కాదు. కానీ వారు పరస్పరం చేసుకొంటున్న తీవ్ర ఆరోపణలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. 

కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులు అడ్డుకొనేందుకు కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారని తెరాస సర్కార్ వాదన. వాటి వలన ప్రాజెక్టులు పూర్తికావడంలో ఆలశ్యం జరిగితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా తెరాస నేతలు అందరూ ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. నిజమే..ఈ న్యాయ వివాదలవలన సకాలంలో ప్రాజెక్టులు పూర్తికాకపోతే పొలాలకు నీళ్ళు అందవు. పైగా ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాలు ఇంకా పెరిగిపోతుంటాయి. అంతిమంగా ఆ భారం మళ్ళీ ప్రజలపైనే పడుతుంది. కనక తెరాస ఆవేదనలో అర్ధం ఉంది.   

అయితే తెరాస సర్కార్ ప్రాజెక్టుల పేరు చెప్పి రైతుల భూములను బలవంతంగా గుంజుకొంటోంది గనుకనే రైతుల తరపున తాము న్యాయస్థానాలలో పోరాడుతున్నామని కాంగ్రెస్ నేతల వాదన. రైతులను కాపాడవలసిన ప్రభుత్వమే వారిపై దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేము కదా? అని వారి వాదన. తాము ఎప్పుడో ప్రారంభించిన ప్రాజెక్టులను ‘రీ డిజైనింగ్’ పేరిట బారీగా అంచనాలు పెంచేసి తెరాస నేతలు జేబులు నింపుకొంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. 

తెరాస సర్కార్ కమీషన్లకు కక్కుర్తిపడుతూ నేటికీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులు అప్పజెప్పుతోందని, ఈ ఆరోపణలకు తన వద్ద బలమైన ఆధారాలున్నాయని, తన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని రేవంత్ రెడ్డి వాదిస్తుంటారు. తెలంగాణా శ్రేయోభిలాషి అని పేరున్న ప్రొఫెసర్ కోదండరామ్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలు కూడా సామాన్య ప్రజలకు చాలా ఆందోళన కలిగించేవిగానే ఉంటున్నాయి.

తమ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేసినవారు నిరూపించాలని లేకుంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొనేందుకు త్వరలో ఒక చట్టం తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వాదన. 

ఈవిధంగా ఎవరి వాదన వారికుంది. అందరూ చాలా బలంగా తమ వాదనలను వినిపిస్తుంటారు. కనుక ప్రభుత్వం చేప్పట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అంతిమ ఫలితాలను బట్టే ప్రజలు ప్రభుత్వ పనితీరును అంచనా వేసుకోవలసి ఉంటుంది. 


Related Post