మోడీ ప్రభావం ఉండదు: కేటిఆర్

March 15, 2017


img

యూపి ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించిన కారణంగా ఇక భాజపాకు దేశంలో ఎదురు ఉండదని భాజపా నేతలు గట్టిగా నమ్ముతున్నారు. భాజపా నేతలే కాదు...మోడీని తీవ్రంగా వ్యతిరేకించే  జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా గట్టిగా అదే చెపుతున్నారు. ప్రతిపక్షాలు     2019 ఎన్నికలపై ఆశలు వదిలేసుకొని 2024ఎన్నికల గురించి ఆలోచించడం మంచిదని ఆయన ట్వీట్ చేశారు. అంటే వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ మోడీ ప్రభంజనం ఉంటుందని చెపుతున్నట్లు అర్ధం అవుతోంది. 

అయితే అప్పటికి ఇంత ప్రభావం ఉండకపోవచ్చని మంత్రి కేటిఆర్ అన్నారు. ముఖ్యంగా మోడీ ప్రభావం తెలంగాణాపై ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 

ఒక్క తెలంగాణాయే కాదు దక్షిణాదిన ఏపి, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ప్రజలపై మోడీ ప్రభావం లేదని నిరూపితమయింది. తెలంగాణాలో తెరాస తరువాత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ పార్టీ కూడా తెరాసను ఓడించే పరిస్థితిలో లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డే పరోక్షంగా చెప్పారు. ఆయన ఒక సర్వే నిర్వహించుకొని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు వస్తాయని చెప్పారు. మరో 25 సీట్లలో తెరాసకు గట్టి పోటీ ఇవ్వగలదని చెప్పారు. 

ఇక రాష్ట్రంలో తెదేపా, భాజపా, వామపక్షాల పరిస్థితి గొప్పగా లేదు. మోడీ ప్రభావంతో రాష్ట్రంలో అవలీలగా గెలిచేయవచ్చని భాజపా నేతలు కలలు కనేమాటయితే వారిని ఎవరూ కాదనరు. కానీ వారు ఎప్పటికీ ఆ కలల ప్రపంచంలోనే జీవించవలసి ఉంటుంది. 

ఇక ఆంధ్రాలో తెదేపా, వైకాపాలు రెండూ చాలా బలంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రత్యేక హోదా, ఇంకా అనేక హామీల విషయంలో కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిందని పవన్ కళ్యాణ్ వాదిస్తున్నారు. జగన్ కూడా అలాగే వాదిస్తున్నారు. కనుక ఏపిలో ఈ మూడు పార్టీలను తట్టుకొని భాజపా ఒంటరిగా నిలబడటం దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చు. కనుక ఏపి ప్రజలపై మోడీ ప్రభావం ఉంటుందా లేదా అని ఆలోచించడం కంటే అయన పట్ల వ్యతిరేకత ఉంటుందా లేదా అని ఆలోచించడం చాలా అవసరం. తెదేపా, భాజపాల మద్య నేటికీ మంచి స్నేహ సంబంధాలే నెలకొని ఉన్నాయి కనుక వచ్చే ఎన్నికలలో కూడా అవి కలిసేపోటీ చేయడమే వాటికీ మంచిది.  

కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఇప్పట్లో లేనట్లే భావించవచ్చు. తెలంగాణాలో ఎలాగూ తెదేపాకు దూరం అయ్యింది కనుక తెరాసతో జత కట్టగలిగితే భాజపా ఒడ్డున పడుతుంది లేకుంటే వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణాలో దాని పరిస్థితి ఇంకా దిగజారవచ్చు.


Related Post