భాజపాకు మరో బంగారు అవకాశం

March 15, 2017


img

తమిళనాడులో అడుగుపెట్టాలని భాజపా చాలా కాలంగా తహతహలాడుతోంది. గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికలలో ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకొని పోటీ చేసి ఆ రాష్ట్రంలో బోణీ కొట్టాలని ప్రయత్నించి భంగపడింది. ఆ తరువాత జయలలిత ఆకస్మిక మృతితో భాజపాకు మళ్ళీ తమిళ రాజకీయాలలో చక్రం తిప్పే అవకాశం దక్కింది. కానీ శశికళ ఎత్తుల ముందు చిత్తైపోయింది. భాజపా తన కలను సాకారం చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ మరో సువర్ణావకాశం వచ్చింది. జయలలిత ప్రాతినిద్యం వహించిన చెన్నైలోని రాధాకృష్ణ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 12న ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఒకరకమైన రాజకీయశూన్యత ఆవరించి ఉంది. కనుక ఈ రాజకీయ నేపద్యంలో జరుగబోయే ఈ ఉపఎన్నికలు భాజపాకు మరో సువర్ణావకాశంగానే చెప్పవచ్చు. భాజపా తరపున పోటీ చేయడానికి నటి గౌతమి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. భాజపా కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా జయలలితకు అందించిన చికిత్స, ఆమె మృతి, శశికళకు వ్యతిరేకంగా ఆమె చాలా గట్టిగా మాట్లాడారు. ఇదే పనిమీద ఆమె రెండు నెలల క్రితం డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసారు. ఆమె కమల్ హాసన్ నుంచి విడిపోయిన తరువాత ఆయన కూడా పళనిస్వామి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 

కనుక ఈ నేపధ్యంలో ఒకవేళ గౌతమి భాజపా తరపున ఆర్.కె.నగర్ నుంచే పోటీ చేసినట్లయితే ఆమె గెలిచే అవకాశాలున్నాయి. ఆమె గెలిస్తే తమిళనాడులో భాజపా అడుగుపెట్టినట్లు అవుతుంది. ప్రస్తుతం చెన్నైలో భాజపాకు ఆమె కంటే మంచి అభ్యర్ధి దొరికే అవకాశం లేదు కనుక తప్పకుండా ఆమెకే అవకాశం కల్పించవచ్చు.  


Related Post