జైట్లీకి మరో శాఖా...ఎందుకు?

March 15, 2017


img

మనోహర్ పార్రికర్ గోవా ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు తన రక్షణమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆ బాధ్యతలను కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకు అప్పగించారు. ఆయన నిన్న రక్షణమంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించారు. 

ఆర్ధిక, రక్షణ శాఖలు రెండూ చాలా కీలకమైనవే. నోట్ల రద్దు తదనంతరం తలెత్తిన సంక్షోభాన్ని సమర్ధంగా పరిష్కరించడంలో అరుణ్ జైట్లీ చాలా దారుణంగా విఫలం అవడం అందరూ చూశారు. ఐదున్నర నెలల తరువాత కూడా నేటికీ ప్రజలు తమ బ్యాంకులలో దాచుకొన్న సొమ్మును తీసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. బ్యాంకులు, ఎటిఎంలలో మళ్ళీ నగదు కొరత ఏర్పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటితో తనకేమీ సంబంధం లేదన్నట్లు అరుణ్ జైట్లీ వ్యవహరిస్తున్నారు. 

మళ్ళీ నగదు కొరత ఎందుకు ఏర్పడింది? అది ఎప్పటిలోగా తీరుతుంది? బ్యాంకులు సామాన్య ప్రజలను ఇష్టం వచ్చినట్లు దోపిడీ చేస్తుంటే వాటిని నియంత్రించడానికి తమ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొంది?వంటి ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందని అరుణ్ జైట్లీ భావిస్తున్నట్లు లేరు. ప్రజలు మళ్ళీ ఇబ్బందులు పడుతుంటే ఆ విషయం తనకు తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదని భావించవలసి ఉంటుంది.

రెండు ప్లస్ రెండు ఎంత అంటే నాలుగు అని మాత్రమే చెప్పగలిగే తెలివితేటలున్న వ్యక్తి అరుణ్ జైట్లీ అని అటువంటి దేశ ఆర్ధికమంత్రిగా పనికిరాడని సాక్షాత్ భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి చెపుతున్నప్పుడు, ప్రధాని మోడీ ఆయనకే కీలకమైన రక్షణమంత్రి శాఖను కూడా అప్పగించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 

మనోహర్ పార్రికర్ రక్షణమంత్రిగా చాలా సమర్ధంగా పనిచేశారని మన త్రివిధదళాలు మెచ్చుకొంటున్నాయి. కానీ దేశ ప్రయోజనాల కంటే గోవాలో భాజపా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనట్లు, ఆయనను గోవాకు పంపించేసి అరుణ్ జైట్లీకు రక్షణమంత్రిత్వ శాఖను అప్పగించారు. ఆర్ధికశాఖను సమర్ధంగా కాకపోయినా కనీసం సంతృప్తికరంగా నిర్వహించలేకపోతున్న అరుణ్ జైట్లీకు రక్షణమంత్రి శాఖను కూడా అప్పగించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 


Related Post