యూపిలో గెలిస్తే దేశాన్ని గెలిచేసినట్లేనా?

March 14, 2017


img

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో యూపి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో మాత్రమే అఖండ విజయం సాధించిన భాజపా, ఐదు రాష్ట్రాలలో ఘన విజయం సాధించామని, యూపి విజయాన్ని యావత్ దేశాన్ని జయించడమే అన్నట్లుగా చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

యూపి దేశంలోకెల్లా పెద్ద రాష్ట్రమే కావచ్చు. కనుక అక్కడ విజయం సాధించడం ఏ రాజకీయ పార్టీకైనా చాలా గొప్ప విషయమే కావచ్చు. కానీ ఆ విజయంతో యావత్ దేశం మోడీ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతోందని చెప్పుకోవడం చాలా అసందర్భంగా ఉంది. భాజపా వాదనే నిజమనుకొంటే అది అధికారంలో ఉన్న గోవాలో కూడా ఎందుకు ఘన విజయం సాధించలేకపోయింది? కనీసం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు సంపాదించలేక ఎందుకు  చతికిలపడింది?

పంజాబ్ లో భాజపా-అకాలీదళ్ సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్ చేతిలో ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయింది? చివరికి మణిపూర్ లో కూడా కాంగ్రెస్ కంటే భాజపా ఎందుకు వెనుకబడిపోయింది? అని ఆలోచిస్తే భాజపాకు యావత్ దేశ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నరనే మాట వాస్తవం కాదని స్పష్టం అవుతోంది.  

యూపి విజయాన్ని యావత్ దేశానికి ఆపాదించలేము. ఎందుకంటే అక్కడ భాజపా విజయానికి అనేక ఇతర కారణాలున్నాయని అందరికీ తెలుసు. కానీ యూపిలో విజయోత్సాహంతో యావత్ దేశమే భాజపాకు జేజేలు పలుకుతోందని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. 

భాజపా కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అని పదేపదే ఇప్పటికే చాలాసార్లు నిరూపితం అయ్యింది. ఒకప్పుడు దక్షిణాదిన భాజపాకు కంచుకోటగా ఉండే కర్నాటకను మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి అవినీతిపరుడైన ఎడ్యూరప్పకు పార్టీ పగ్గాలు అప్పజెప్పింది. కొన్ని నెలల క్రితం జరిగిన దక్షిణాది రాష్ట్రాల  ఎన్నికలలో భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగుపెట్టలేకపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే తెలంగాణాలో గత మూడేళ్ళలో జరిగిన ఏ ఒక్క ఎన్నికలలో భాజపా విజయం సాధించలేకపోయింది. చివరికి అది చాలా బలంగా ఉందనుకొన్న గ్రేటర్ హైదరాబాద్ లో కూడా తెరాస చేతిలో చాలా దారుణంగా ఓడిపోయింది. 

కనుక వాపును చూసి బలుపు అని సంబురాలు చేసుకోవడం కంటే తమ ప్రభుత్వపాలన ప్రజారంజకంగా సాగుతోందా లేదా? సామాన్య ప్రజలు తమ పాలనతో సంతృప్తి చెందుతున్నారా? అని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొంటూ ముందుకు సాగడం మంచిది. ఇది భాజపాకే కాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. 


Related Post