మెజార్టీ రాకపోయినా అధికారం వారిదే!

March 13, 2017


img

గోవా, మణిపూర్ రాష్ట్రాలలో భాజపా కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు గెలుచుకొంది. కానీ రెండు చోట్లా కూడా భాజపాయే అధికారంలోకి రాబోతోంది. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17, భాజపా 13 స్థానాలు లభించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 21మంది ఎమ్మెల్యేలు అవసరం. కనుక మరో నలుగురు ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టితే గోవాలో కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కేది. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే భాజపా చాలా చురుకుగా పావులు కదిపి ఎంజి.పి., జిపిఎఫ్ మరియు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా గట్టింది. వారు కూడా గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పార్రికర్ మళ్ళీ గోవా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే మాటయితే భాజపాకు మద్దతు ఇస్తామని ప్రకటించడంతో భాజపా అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 

కనుక ఆయన నిన్న సాయంత్రం గోవా గవర్నర్ మృదులా సిన్హాను కలిసి తాను ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నానని తెలిపి, తనకు మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలను ఆమెకు సమర్పించారు. ఆమె వాటిని పరిశీలించి మనోహర్ పార్రికర్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో ఆయన ఒకటి రెండు రోజుల్లోనే ఆయన గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అంతకంటే ముందుగా ఆయన తన రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయవలసి ఉంది. బహుశః ఈరోజు రాజీనామా చేయవచ్చు. 

చాలా కీలకమైన రక్షణమంత్రిత్వ శాఖను మనోహర్ పార్రికర్ అత్యంత సమర్ధంగా నిర్వహించారు. కనుక ఇప్పుడు ఆయన స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎవరిని నియమిస్తారో చూడాలి. గోవాలో కాంగ్రెస్ పార్టీకి అధికారం చేతికి అందినట్లే అంది చేజారిపోయింది. మణిపూర్ లో కూడా సరిగ్గా ఇటువంటి పరిస్థితే నెలకొని ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు వచ్చిన భాజపాయే అధికారం దక్కించుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Related Post