ఈ క్రెడిట్ వాళ్ళిద్దరిదే

March 12, 2017


img

యూపిలో భాజపా చేతిలో సమాజ్ వాదీ-కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం తరువాత అందరూ మోడీ గురించే మాట్లాడుకొంటున్నారు. అలాగే రాహుల్ గాంధీ, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా సేవలందించిన ప్రశాంత్ కిషోర్ గురించి కూడా మాట్లాడుకొంటున్నారు. ఈ ఎన్నికలలో సమాజ్ వాదీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించి ఉండి ఉంటే ఆ క్రెడిట్ తప్పకుండా వారిరువురికే దక్కి ఉండేది. కనుక ఈ ఓటమికి కూడా వారిరువురే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి 105 సీట్లు అడిగి తీసుకొని పోటీ చేస్తే కేవలం 7 సీట్లు మాత్రమే గెలుచుకొంది. కనుక సమాజ్ వాదీ సంగతి పక్కన పెట్టి చూస్తే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయిందని అర్ధం అవుతోంది. మోడీ ప్రభంజనమే వారి ఓటమికి కారణం కావచ్చు. కానీ కాంగ్రెస్ ఓటమికి వారు మోడీని నిందించలేరు కనుక తమను తామే నిందించుకోక తప్పదు. 

ఈ ఘోరపరాజయం కారణంగా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలపై చర్చ మొదలయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆయన పార్టీ పగ్గాలు చేప్పట్టడానికి వెనుకాడవచ్చు. ఒకవేళ ధైర్యం చేసినా పార్టీలో అభ్యంతరాలు వ్యక్తం కావచ్చు. 

ఎన్నికల వ్యూహ నిపుణుడుగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి శల్యసారధ్యం చేశారని చెప్పవచ్చు. అది మొదటిరోజు నుంచి ఎన్నికల ప్రచారం చివరి రోజు వరకు అడుగడుగునా కనబడుతూనే ఉంది. ఇక పంజాబ్ లో ఆయన అమలు చేసిన ఎన్నికల వ్యూహాల కంటే అకాలీదళ్-భాజపా సంకీర్ణ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతే కాంగ్రెస్ విజయానికి ఎక్కువ దోహదపడిందని చెప్పవచ్చు. 

యూపిలో కాంగ్రెస్ ఓటమి రాహుల్ గాంధీ రాజకీయ జీవితంపై ఏ మేరకు ప్రభావం చూపబోతోందనేది రానున్న రోజులలో తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ ఒక ఉద్యోగి వంటివాడు కనుక మళ్ళీ ఏదో ఒక పార్టీని పట్టుకోవడం ఖాయం. 


Related Post