కేసీఆర్ పై ఆ ప్రభావం ఉంటుందో లేదో?

March 12, 2017


img

ఉత్తరప్రదేశ్ లో భాజపా అందరి అంచనాలను తిరగరాస్తూ 400 సీట్లలో ఏకంగా 325 సీట్లు దక్కించుకోవడంతో ఇప్పుడు అందరూ ప్రధాని నరేంద్ర మోడీని, భాజపా అధ్యక్షుడు అమిత్ షాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వారి ముందు ఎవరూ నిలువలేరని భాజపా నేతలు, మంత్రులు గొప్పలు చెప్పుకొంటున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాలని, దాని కోసం ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేయాలని అమిత్ షా ఇదివరకు చాలాసార్లు తమ రాష్ట్ర నేతలకు గట్టిగా చెప్పేవారు. కానీ వారిలో అంతగా చలనం కనబడటం లేదు. పైగా కొన్ని నెలల క్రితం తెరాస, భాజపాలు చాలా దగ్గరైనట్లు కనబడ్డాయి కూడా. వాటి తీరు చూసి రెండూ వచ్చే ఎన్నికలలో పొత్తులు పెట్టుకొని పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. వాటిని తెరాస, భాజపా నేతలు ఎవరూ ఖండించకపోవడంతో అవి నిజమేననే అభిప్రాయం చాల మందికి కలిగింది. 

నిజానికి రాష్ట్రంలో చాలా బలంగా నిలద్రొక్కుకొన్న తెరాసకు భాజపాతో పొత్తులు పెట్టుకొనవసరం లేదు. తన ఉనికిని కాపాడుకోవడం కోసం భాజపాయే తెరాసతో పొత్తులు పెట్టుకోవలసిన అవసరం ఉంది. బహుశః అందుకే తెరాసకు కొంచెం దగ్గరైనట్లు భావించవచ్చు. కానీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాలలోనే ఒక బిల్లును ప్రవేశపెడతానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తరువాత భాజపా నేతల వైఖరిలో స్పష్టమైన మార్పు కనబడింది. అప్పుడే తెరాసతో పొత్తులు పెట్టుకొనే ఆలోచన లేదని నిర్ద్వందంగా ప్రకటించారు. 

కానీ తెరాస స్పందించకపోవడం విశేషం. భాజపా నేతలు అప్పుడప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పటికీ, తెరాస నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ప్రతివిమర్శలు చేయకపోవడం కూడా గమనించవలసిన విషయమే. బహుశః మున్ముందు భాజపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనే ఆలోచన ఉన్నందున లేదా రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం సహకారం చాలా అవసరం ఉంది కనుకనే తెరాస సంయమనం పాటిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. 

వచ్చే ఎన్నికలలో కేంద్రంలో మళ్ళీ భాజపా, రాష్ట్రంలో తెరాస గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక వచ్చే ఎన్నికలలో ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొన్నట్లయితే వాటి విజయావకాశాలు ఇంకా మెరుగవుతాయి. ఇంతవరకు భాజపాతో పొత్తు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించారో లేదో తెలియదు కానీ నిన్న యూపిలో భాజపా ఘన విజయం సాధించినందున ఇప్పుడు పొత్తుల ఆలోచన చేయవచ్చు. 


Related Post