కేసీఆర్ కు రమణ బస్తీమే సవాల్

March 11, 2017


img

తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిన్న ఒక సవాల్ విసిరారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, తెరాసకు 101-106 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకొంటున్న కేసీఆర్ కు నిజంగా అంత నమ్మకం, ధైర్యం ఉంటే వెంటనే తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ చేయించుకొన్న సర్వేలు..వాటి ఫలితాలు చూస్తుంటే, ఒక విద్యార్ధి తనకు తానే ప్రశ్నాపత్రం తయారుచేసుకొని మార్కులు వేసుకొన్నట్లు ఉందని రమణ ఎద్దేవా చేశారు. మూడేళ్ళ పాలనలో చేసిందేమీ లేకపోవడం చేత ప్రజలను మభ్యపెట్టేందుకే కేసీఆర్ ఈవిధంగా గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు. మిగులు బడ్జెట్ తో చేతికి అందిన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసారని రమణ విమర్శించారు. 

తెలంగాణాలో తెదేపా అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఎల్ రమణ, కేసీఆర్ సర్వేలను ఎద్దేవా చేస్తున్నప్పుడు తమ పార్టీ అధినేత, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గత మూడేళ్ళుగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ తన మంత్రులు, ఎమ్మెల్యేలకు మార్కులు కూడా వేస్తున్నారనే సంగతి మరిచిపోవడం చాలా విచిత్రం. 

చంద్రబాబు ఎన్నికల గురించి మాట్లాడకపోయినా ప్రజలందరూ తమ పార్టీ వైపే ఉన్నారని గొప్పలు చెప్పుకొంటుంటారు. అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మూడేళ్ళలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి తప్ప మరేమీ చేయలేకపోయిందని, ప్రభుత్వం అన్ని రంగాలలో ఘోరంగా విఫలం అయ్యిందని విమర్శిస్తుంటారు. 

కనుక తెలంగాణాలో తెదేపా నేతలు తెరాస సర్కారుపై పంచ్ డైలాగులు విసిరే ముందు అవి ఏపిలో తమ తెదేపా సర్కార్ కు, చంద్రబాబు నాయుడుకు కూడా తగిలే ప్రమాదం ఉందో లేదో చూసుకొని విసిరితే మంచిది. 


Related Post