ప్రతిపక్షాలపై వేటు తప్పదా?

March 11, 2017


img

గవర్నర్ నరసింహన్ నిన్న ఉభయ సభల సభ్యులను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగం అంతా అబద్దాలతో నిండి ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్, తెదేపా సభ్యులు మద్యలోనే సభ నుంచి వాక్-అవుట్ చేసారు. సాధారణంగా గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వమే తయారుచేయించి ఇస్తుంది గనుక సహజంగానే దానిలో తమ ప్రభుత్వం గురించి గొప్పగా వ్రాసుకొని దానినే గవర్నర్ నోట పలికించుకొని తృప్తి పడుతుంటుంది. కనుక ప్రతిపక్షాలు దానిని వ్యతిరేకించడం కూడా సహజమే. కానీ ప్రతిపక్షాలు దానితో ఏకీభవించకపోయినప్పటికీ ఆయన ప్రసంగిస్తున్నపుడు అడ్డుపడకుండా నిశబ్దంగా వినడం సాంప్రదాయం. ఆ తరువాత మీడియా పాయింటు వద్ద, మళ్ళీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చ జరిగేటప్పుడు దానిపై ప్రతిపక్షాలు నిర్మోహమాటంగా తమ అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. కానీ గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా వినకుండానే  ప్రతిపక్షాలు దానిపై నిరసన తెలుపుతూ మధ్యలోనే సభ నుంచి వాక్ అవుట్ చేయడం చెడు సంప్రదాయమేనని చెప్పక తప్పదు. 

శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి హరీష్ రావు అందుకు ప్రతిపక్షాలను తీవ్రంగా ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో హరీష్ రావుతో సహా మరికొందరు మంత్రులతో సమావేశమయ్యి ప్రతిపక్షాల తీరుపై చర్చించారు. గవర్నర్ పట్ల అమర్యాదగా వ్యవహరించినందుకు కాంగ్రెస్, తెదేపా సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆయన భావిస్తునట్లు సమాచారం. ఒకవేళ ఆ రెండు పార్టీలు తమ అనుచిత ప్రవర్తనకు సభాపతిని క్షమాపణ కోరితే క్షమించుదామని లేకుంటే సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ క్షమాపణలు చెపితే తాము చేసింది తప్పే అని ఒప్పుకొన్నట్లు అవుతుంది కనుక వారు దానికి అంగీకరించకపోవచ్చు. కనుక వారిపై సస్పెన్షన్ వేటు తప్పక పోవచ్చు. అది ఎన్ని రోజులు ఉంటుందనే తెలియవలసి ఉంది.

శాసనసభ సమావేశాలు ఇంకా ప్రారంభం కాకమునుపే కాంగ్రెస్, తెదేపాలు ఈవిధంగా పెద్ద తప్పటడుగువేసి తెరాస సర్కార్ కు గొప్ప ఆయుధం అందించడం విశేషం. అపార రాజకీయ, పరిపాలనానుభావం ఉన్న జానారెడ్డి వంటి సీనియర్ నేత తమ పార్టీ చేస్తున్న తప్పును సరిదిద్దకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.  


Related Post