రేపు కమలం వికసిస్తుందో లేదో?

March 10, 2017


img

రేపే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు చేసిన సర్వేల ప్రకారం కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భాజపా విజయం సాధించే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. కానీ కొన్ని నివేదికలు భాజపాకు పూర్తి మెజారిటీ రాకపోవచ్చునని, ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతు అవసరం పడవచ్చని చెపుతున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా వగైరాలను అధ్యయనం చేసి ఫలితాలను ఊహించి చెప్పడంలో మంచిపేరు గల మోగియా అనే సంస్థ యూపిలో భాజపాకు పూర్తి మెజారిటీ రాబోతోందని బల్లగుద్ది చెపుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 202 సీట్లు అవసరం కాగా భాజపాకు కనీసం 220-222 సీట్లు సాధించడం ఖాయం అని చెపుతోంది. 

యూపి తరువాత కీలకమైన రాష్ట్రం పంజాబ్. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న అకాలీదళ్-భాజపా కూటమి ఘోర పరాజయం పాలవబోతోందని అన్ని సర్వేలు ముక్త కంఠంతో చెపుతున్నాయి. అక్కడ కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలకు సరిసమానంగా లేదా ఆమాద్మీకి కొద్దిగా ఎక్కువగా సీట్లు లభించవచ్చని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఆమాద్మీ పార్టీకే అధికారం దక్కే అవకాశాలున్నాయని మరి కొన్ని సర్వేలు సూచిస్తున్నాయి. 

ఇక భాజపా అధికారంలో ఉన్న గోవాలో మిగిలిన పార్టీల కంటే భాజపా ఎక్కువ సీట్లు సాధించగలదు కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతు అవసరం పడవచ్చని సర్వేలు సూచిస్తున్నాయి. ఆమాద్మీ పార్టీ కూడా ఈసారి గోవాలో పోటీ చేసి ఓట్లు చీల్చబోతున్నందునే అక్కడ భాజపా నష్టపోవలసివస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా బలపడి భాజపాకు గట్టి పోటీనిచ్చింది. కనుక గోవాలో భాజపా మళ్ళీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తోంది.  

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాజపా విజయం సాధించే అవకాశాలున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి.  

ఇక ప్రతీ ఎన్నికలతో ఈశాన్య రాష్ట్రాలపై తన పట్టు పెంచుకొంటున్న భాజపా ఈసారి మణిపూర్ లో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మణిపూర్ లో 85శాతం పైగా ఓటర్లు పోలింగ్ లో పాల్గొనడం అందుకేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

రేపు మధ్యాహ్నం 12 గంటల లోపే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో తేలిపోవచ్చు. కనుక అంత వరకు ఓపిక పట్టవలసిందే.  



Related Post