ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శుభవార్త!

March 09, 2017


img

రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించి తమ తమ పార్టీలలో చేర్చుకొన్న సంగతి తెలిసిందే. వారి చేరికతో ఆ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది. అలాగే కొత్తగా చేరినవారు కూడా వచ్చే ఎన్నికలలో తమకు టికెట్స్ లభిస్తాయో లేదోననే అనుమానంతోనే ఉన్నారు. ‘వచ్చే ఎన్నికలలోగా శాసనసభ నియోజక వర్గాల సంఖ్య తప్పకుండా పెరుగుతుంది కనుక ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని’ వారికి కేసీఆర్, చంద్రబాబు అభయహస్తం ఇస్తున్నారు. కానీ 2026 వరకు అటువంటి ఆలోచన కూడా చేయదలచుకోలేదని కేంద్రప్రభుత్వం పదేపదే చెప్పింది. అయినా కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా ధీమాగా ఉన్నారు.

వారు చెపుతున్నట్లుగానే, రెండు రాష్ట్రాలలో శాసనసభ సీట్లు పెంచడానికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అంటే రాష్ట్ర జనాభా, నియోజకవర్గాల వారిగా జనాభా, వాటి భౌగోళిక వివరాలు వగైరా వివరాలన్నీ వీలైనంత త్వరగా పంపించమని కోరుతూ కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు వ్రాసింది. దానిపై తెలంగాణా ప్రభుత్వం అప్పుడే కసరత్తు ప్రారంభించింది.

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో 17 ఎంపి నియోజక వర్గాలు, వాటి క్రింద 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రాలో 25 ఎంపి, వాటి క్రింద 175 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని సెక్షన్ 170 ప్రకారం శాసనసభ స్థానాలను పెంచుకోవచ్చు కనుక ఆంధ్రప్రదేశ్ లో మరో 50, తెలంగాణాలో మరో 34 శాసనసభ స్థానాలు పెంచుతామని విభజన చట్టంలో హామీ ఇవ్వబడింది. అంటే అప్పుడు తెలంగాణాలో 153, ఆంధ్రాలో 225 సీట్లు ఏర్పడతాయన్న మాట. ప్రస్తుతం ఒక్కో ఎంపి నియోజకవర్గం క్రింద 7 శాసనసభ స్థానాలు ఉండగా వాటిని 9కి పెంచడం ద్వారా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ సీట్ల సంఖ్యను పెంచాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. 

అందుకు ప్రతిపాదనలు పంపించమని అదే స్వయంగా కోరింది కనుక ఈ తీయటి కబురు కోసమే చాలా కాలంగా ఎదురుచూస్తున్న రెండు ప్రభుత్వాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కేంద్రం కోరిన ఆ వివరాలను అన్నిటినీ పంపిస్థాయి. ఒకవేళ కేంద్రప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పార్లమెంటు చేత ఆమోదింపజేయగలిగితే, 2019 ఎన్నికల నాటికే ఈ పెరిగిన సీట్లు కూడా అందుబాటులోకి వస్తాయి కనుక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు, వారిని చేర్చుకొన్నా తెదేపా, తెరాసలకు నిశ్చింతగా ఎన్నికలను ఎదుర్కోవచ్చు. 

కానీ ఇది ఎమ్మెల్యేలను కోల్పోయిన ప్రతిపక్షాలకు చాలా నిరాశ కలిగించే విషయమే అవుతుంది. శాసనసభ సీట్లు పెంచకపోతే అధికార పర్తీలలోకి వెళ్ళినవారు అందరూ తప్పకుండా వెనక్కి తిరిగి వస్తారని, ఒకవేళ రాకపోయినా వారు చాలా తీవ్రంగా నష్టపోతారని భావిస్తున్న ప్రతిపక్షాలకు ఇది చాలా నిరాశ కలిగించవచ్చు.  


Related Post