కేసీఆర్, బాబు దొందూ దొందేనా?

March 09, 2017


img

రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి దాదాపు మూడేళ్ళు కావస్తోంది. ఈ మూడేళ్ళ కాలంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తి చేసిన పనులకంటే ఇంకా కొత్తగా ఇస్తున్న హామీలు, చెపుతున్న మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాకపోతే వారిద్దరిలో ఒకటే తేడా కనిపిస్తోంది. కేసీఆర్ మంచి మాటకారి కనుక అయన మాటలతోనే కోటలు కట్టేసి జనాలకు బంగారి తెలంగాణా సినిమా చూపిస్తున్నారు. కానీ పాపం చంద్రబాబు ఆయనంత మాటకారి కాదు కనుక విదేశీ కంపెనీలకు కోట్లు చెల్లించి అందమైన రంగురంగుల డ్రాయింగులు గీయించుకొని తెచ్చి వాటిని ప్రజలకు పంచిపెడుతూ రోజులు దొర్లించేస్తున్నారు. 

ముందుగా బాబుగారి మూడేళ్ళ కధను తిరగేస్తే, దానిలో సింగపూర్ వంటి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పంటరుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, లేకుంటే నెలకు రూ.2,000 నిరుద్యోగ బృతి, కాపులకు రిజర్వేషన్లు, వైజాగ్, విజయవాడలలో మెట్రో రైల్ నిర్మాణం, పోర్టులు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు..వగైరా వగైరా ఇలాగ చెప్పుకొంటూపోతే ఆ జాబితాకు అంతే కనబడదు. కానీ వాటిలో ఏ ఒక్క హామీని పూర్తి చేయలేకపోయారు. చేసే అవకాశం ఉన్నట్లు కనబడటం లేదు. చేయాలంటే మరోసారి మళ్ళీ ఆయనకే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. 

రాజధాని నిర్మాణం పేరుతో అధ్యయన కమిటీలు..దేశవిదేశాల పర్యటనలు..విదేశీ సంస్థలతో ఒప్పందాలతో రోజులు దొర్లించేస్తున్నారు. కానీ రాజధాని నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. వేల కోట్లు ఖర్చు పెట్టేసి ఏడాదిలోనే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక శాసనసభ కట్టేసాము..అని గొప్పలు చెప్పుకొంటూ అదే అమరావతి అనుకోమని ప్రజలకు నచ్చజెపుతున్నారు. ఇదేమిటని గట్టిగా ప్రశ్నిస్తున్న జగన్ పై రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకి, రాష్ట్ర ద్రోహి  ముద్రలు గుద్దేసి గొంతు నొక్కేస్తున్నారు. 

అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయన తన మాట నిలబెట్టుకొన్నారని అంగీకరించక తప్పదు. ఆంధ్రాను “సన్ రైజ్ స్టేట్” గా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే తన కొడుకు నారా లోకేష్ ను ఎమ్మెల్సీ చేసుకొని, త్వరలో మంత్రిగా కూడా చేసేసి తన ‘సన్ రైజ్’ హామీని నిలబెట్టుకొంటున్నారు. ‘సన్ రైజ్’ అంటే సరిగ్గా అర్ధం చేసుకోలేని వారు మాత్రమే ఏదేదో ఊహించుకొని నిరాశ చెందుతున్నారు.

ఇక కేసీఆర్ విషయానికి వస్తే అయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజి, ముస్లింలకు రిజర్వేషన్లు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, దాని చుట్టూ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు, పంట రుణాల మాఫీ వంటివన్నీ మాటలతోనే ప్రజల కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసి చూపిస్తున్నారు. కానీ చంద్రబాబుతో పోలిస్తే ఆయన చాలా నయమనే చెప్పవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల సమూల ప్రక్షాళన, జిల్లాల పునర్విభజన, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కొన్ని ఎత్తిపోతల ప్రాజెక్టులు వంటివి చేసి చూపిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన, ఇంకా ఇస్తున్న హామీలను అమలు చేయాలనే చిత్తశుద్ధి ఆయనలో ఉండి ఉండవచ్చు కానీ వాటన్నిటినీ అమలుచేయాలంటే మరో ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం కావలసి ఉంటుంది. 

ఆచరణ సాద్యం కాని హామీలను గొప్పగా ప్రకటించుకోవడం వలననే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇన్ని విమర్శలు, అప్రదిష్ట మూటగట్టుకొంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


Related Post