అంతులేని తమిళ సినిమా

March 08, 2017


img

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి మరణించి 3 నెలలు గడిచాయి కానీ తమిళ రాజకీయలు ఇంకా ఆమె చుట్టూనే తిరుగుతుండటం విశేషం. ఆమె మృతి చెందిన తరువాత శశికళ, పన్నీర్ సెల్వం మద్య జరిగిన రాజకీయ చదరంగంలో ఇద్దరూ ఓడిపోగా ఊహించని విధంగా పళనిస్వామి ముఖ్యమంత్రి అయిపోయారు. శశికళ మూడున్నరేళ్ళ పాటు జైలులో గడపాలి. పన్నీర్ సెల్వం పార్టీకి దూరం అవడం వలన ఏకాకిగా..రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయారు. 

ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న జయలలిత మృతిపై తనకు అనుమానాలున్నాయని, కనుక సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బుధవారం చెన్నైలోని రాజారత్నం స్టేడియంలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేశారు. ఆయన మద్దతుదారులు అన్ని జిల్లా కేంద్రాలలో దీక్షలు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జయలలిత డిశంబర్ 5వ తేదీన రాత్రి 11.30 గంటలకు చనిపోయినట్లు అపోలో ఆసుపత్రి ప్రకటించిందని కానీ ఆమె ఆరోజు సాయంత్రం 4.30 గంటలకే చనిపోయిందనే సమాచారం తనకు 6.30 గంటలకు తెలిసిందని చెప్పడం విశేషం. అదే నిజమైతే ఆయన ఆ రోజు అర్ధరాత్రి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అపోలో ఆసుపత్రిపై విచారణకు ఆదేశించవచ్చు. కనీసం జయలలిత అంత్యక్రియలు పూర్తయిన తరువాత అయినా ఆదేశించవచ్చు. కానీ నేటి వరకు ఈ విషయం ఆయన బయటపెట్టనే లేదు. ఒకవేళ ఆయన చెపుతున్నది నిజమే అయితే, ఆ నేరాన్ని దాచిపెట్టినందుకు ఆయన కూడా శిక్షార్హుడే అవుతారు. 

ఒకవేళ ఆయన చెప్పినట్లు జయలలితకు అందించిన వైద్యం, ఆమె మృతి చెందిన సమయం విషయాలలో ఏమైనా తప్పులు లేదా కుట్రలు జరిగి ఉండి ఉంటే, వాటిని బయటపెడితే కేంద్రప్రభుత్వం, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు, స్వయంగా పన్నీర్ సెల్వం, శశికళ, అపోలో ఆసుపత్రి యాజమాన్యం, చివరికి జయలలిత భద్రతా సిబ్బంది అందరూ చాలా చిక్కులో పడతారు. కనుక ఆ రహస్యం ఎన్నటికీ బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇంత చిన్న సంగతి సెల్వంకు తెలియదనుకోవాలా? లేక తెలిసీ ప్రజలను ఆకట్టుకోవడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారనుకోవాలా? లేకపోతే తనకు ఎంత ప్రజా బలం ఉందో పరిశీలించుకొని దానిని శశికళ వర్గానికి ప్రదర్శించాలనుకొన్నారా?

జయలలిత మృతిపై విచారణ కు డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేయడం కంటే ఆమె పేరుతో ఓ కొత్త పార్టీ పెట్టుకొని ఆమె భజన చేస్తూ ముందుకు సాగితే, ప్రజలకు ఆయనపై ఇంకా ఏమైనా సానుభూతి మిగిలి ఉండి ఉంటే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు.


Related Post