వాళ్ళిద్దరూ టిజెఎసి నుంచి అవుట్

March 08, 2017


img

తెలంగాణా రాజకీయ జెఎసి (టిజెఎసి) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తీరును నిరసిస్తూ బయటకు వెళ్ళిపోయిన టిజెఎసి నేతలు పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్ మళ్ళీ ఆయనను విమర్శిస్తూ లేఖలు వ్రాస్తున్న సంగతి తెలిసిందే. వారిరువురినీ సస్పెండ్ చేస్తున్నట్లు టిజెఎసి ప్రకటించింది. నిన్న టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన హైదరాబాద్ లో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి ఈ నిర్ణయం తీసుకొన్నారు. వారిరువురూ తెరాస సర్కార్ ప్రలోభాలకు లొంగిపోయి టిజెఎసిని వ్యతిరేకించడం చాలా దురదృష్టకరమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. టిజెఎసి నేతృత్వంలో జరిగిన నిరుద్యోగ ర్యాలీ విజయవంతం అవడంతో చాలా కంగారుపడిన తెరాస సర్కార్, టిజెఎసిని చీల్చేందుకు కుట్రలు పన్నుతోందని, బయటకు వెళ్ళిపోయిన నేతలిద్దరి ద్వారా టిజెఎసిని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నామని టిజెఎసి పేర్కొంది.     

టిజెఎసి చేసిన ఈ ప్రకటనపై పిట్టల రవీందర్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. ప్రొఫెసర్ కోదండరామ్ తీరును ప్రశ్నించినంత మాత్రాన్న తమ వెనుక తెరాస సర్కార్ ఉన్నట్లు భావించడం సబబేనా? అని ప్రశ్నించారు. తమ వెనుక తెరాస సర్కార్ ఉన్నట్లయితే ప్రొఫెసర్ కోదండరామ్ వెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలుసని అన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ తీరు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో అయన పరిచయాలు అన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయని పిట్టల రవీందర్ ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా సాగవలసిన జేఎసిని ఆయన రాజకీయ పార్టీల చేతుల్లో పెట్టేశారని అవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రొఫెసర్ కోదండరామ్ కు రాజకీయ పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉన్నట్లయితే, తమకేమీ అభ్యంతరం లేదు కానీ ముందు ఆయన టిజెఎసిని విడిచిపెట్టాలని పిట్టల అన్నారు. త్వరలోనే అందరితో సమావేశమయ్యి భవిష్య కార్యాచరణను నిర్ణయించుకొంటామని పిట్టల రవీందర్ చెప్పారు. 

ఇంతవరకు తెరాస సర్కార్ తో పోరాడిన టిజెఎసి నేతలు ఇప్పుడు వారిలో వారే పోరాడుకొంటున్నారు. పిట్టల వెనుక తెరాస ఉందని ఆరోపిస్తుంటే, ప్రొఫెసర్ కోదండరామ్ వెనుక కాంగ్రెస్, ఇతర పార్టీలు ఉన్నాయని పిట్టల ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలు టిజెఎసిలో చీలిక అనివార్యమని సూచిస్తున్నాయి.  


Related Post