ఆ అవకాశం ఇచ్చింది తెరాసయే!

March 08, 2017


img

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ వాటి కోసం జరుగుతున్న భూసేకరణ ప్రక్రియకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుపడుతూనే ఉందని తెరాస నేతలు, మంత్రి హరీష్ రావు తరచూ ఆరోపిస్తూనే ఉన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా చనిపోయినవారి పేరిట కూడా పిటిషన్లు వేయించడం కాంగ్రెస్ నేతలకే సాధ్యం అని అన్నారు. ఒకవైపు కోర్టులలో పిటిషన్లు వేస్తూనే మళ్ళీ పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, తమ పార్టీ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకం కాదని వాదిస్తుండటాన్ని హరీష్ రావు తప్పు పట్టారు. 

మహబూబ్ నగర్ లో ప్రాజెక్టు వలన అక్కడి అభయారణ్యంలో పులుల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసిన మాట నిజామా కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఒకసారి ఆ ప్రాజెక్టు కడుతున్న ప్రాంతానికి వచ్చి అక్కడ పులులే ఉన్నాయో పిల్లులే ఉన్నాయో చూపించాలని హరీష్ రావు అన్నారు. 

తెలంగాణాకు నీళ్ళ విషయంలో చాలా అన్యాయం జరిగిందనే బాధతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శరవేగంగా ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు నీళ్ళు అందించాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ నేతలు అడుగడుగుణ అడ్డుపడుతూనే ఉన్నారని హరీష్ రావు విమర్శించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో సాద్యం కాని ప్రాజెక్టులను తెలంగాణా ప్రభుత్వం పూర్తి చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు దానికి సహకరించకపోగా సమస్యలు సృష్టిస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 

హరీష్ రావు ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. కానీ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నేతలనుసరిస్తున్న ఈ ద్వంద వైఖరిని ఎండగట్టడంలో తెరాస నేతలు విఫలం అవుతున్నట్లు కనబడుతోంది. ఒకవైపు కోర్టులలో పిటిషన్లు వేస్తూ మళ్ళీ ప్రాజెక్టుల పురోగతిపై కాంగ్రెస్ నేతలు ప్రశ్నించినప్పుడు వారు వేస్తున్న పిటిషన్లనే చూపించి శాసనసభలో, ప్రజల సమక్షంలో నిలదీయవచ్చు. అయితే భూసేకరణ విషయంలో తెలంగాణా ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించకపోవడం వలననే కాంగ్రెస్ నేతలు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పక తప్పదు. 

మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం తెలంగాణా ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నప్పుడు, అక్కడికి ప్రతిపక్ష నేతలు ఎవరూ వెళ్ళకుండా అక్కడి నిర్వాసితులు ఎవరూ ప్రతిపక్ష నేతలను కలవనీయకుండా పోలీసులను పెట్టి అడ్డుకోవడమే అందుకు నిదర్శనం. నిర్వాసితులను కలిసేందుకు అనుమతించవలసిందిగా కోరుతూ ప్రతిపక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది అంటే అక్కడి  పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చు. భూసేకరణ విషయంలో తెలంగాణా ప్రభుత్వం పూర్తి  పారదర్శకతతో వ్యవహరిస్తున్నట్లయితే ఈ గోప్యత, నిర్బంధాలు ఎందుకు? భూసేకరణ ప్రక్రియలో తెరాస సర్కార్ పూర్తి పారదర్శకత పాటిస్తే ఈ సమస్యలు ఉండేవి కావు కదా?


Related Post