దానితో అమెరికన్లకీ ఇబ్బందేనా?

March 07, 2017


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 6 దేశాలపై మూడు నెలలపాటు నిషేధం విధిస్తూ సోమవారం జారీ చేసిన తాజా ఉత్తర్వులలో అమెరికన్లకు కూడా హెచ్చరికలు చేయడం విశేషం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ఉన్న అమెరికా కౌన్సిలేట్ ఉద్యోగులు, ఆ దేశాలలో పర్యటిస్తున్న అమెరికన్ పౌరులపై ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉంది కనుక అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ఉత్తర్వులలో హెచ్చరికలు చేశారు. అలాగే భారత్ లో కూడా ఉగ్రవాదులతో సంబంధాలున్నవారు ఉన్నందున భారత్ పర్యటనలో కూడా అమెరికన్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా అమెరికన్ కార్యాలయాలపై ఉగ్రవాదుల దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని ఆ ఉత్తర్వులలో హెచ్చరించింది. 

అమెరికాలోకి విదేశీయులు ఎవరూ ప్రవేశించవద్దని ట్రంప్ ఆదేశాలు జారీ చేయడం ఆయన ఇష్టం. కానీ అందుకు అమెరికన్లపై దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేయడం గమనిస్తే, ఆయన నిర్ణయాల వలన అమెరికన్లకు కూడా కొత్త ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అని స్పష్టం అవుతోంది. 

అమెరికా కర్ర పెత్తనం చేస్తున్నందుకు చాలా దేశాలు దానిపై ఆగ్రహంగా ఉన్నమాట వాస్తవం. అమెరికా ఉగ్రవాదంపై చేస్తున్నపోరును ముస్లింలపై, తమ ఇస్లాం మతంపై చేస్తున్న యుద్ధంగానే ముస్లిం దేశాలు భావిస్తున్న కారణంగానే, అవి అమెరికా పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తుంటాయి. ఇప్పుడు 6 ముస్లిం దేశాలపై ట్రంప్ ప్రభుత్వం నిషేధం విదించడం ద్వారా వారి అనుమానాలు నిజమేనని దృవీకరించినట్లయింది. 

కనుక అమెరికన్ల పట్ల వారికి మరింత ఆగ్రహం, ద్వేషం పెరిగే అవకాశం ఉందని, దాని వలన అమెరికన్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందనే సంగతి ట్రంప్ ప్రభుత్వం బాగానే గుర్తించినట్లుంది. అందుకే ఈ హెచ్చరికలను జారీ చేశారని అర్ధం అవుతోంది. ఒక కుటుంబంలో చిన్నమార్పు తీసుకురావాలంటే ఒక పద్ధతి ప్రకారం మెల్లగా చేసుకొంటాము. కానీ శతాబ్దాలుగా అమెరికాలో నెలకొన్న పరిస్థితులను రాత్రికి రాత్రే మార్చేయాలని ట్రంప్ అనుకోవడం వలననే ఈ సమస్యలన్నీ పుట్టుకు వస్తున్నాయని చెప్పవచ్చు. 


Related Post