గవర్నర్ పై భాజపా విమర్శలు...దేనికి?

March 07, 2017


img

గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు ఒక్కోసారి అధికార తెరాస కూడా విమర్శలు చేస్తుంటాయి. కానీ భాజపా మాత్రం విమర్శలకు దూరంగా ఉంటుంది. కారణం గవర్నర్ అంటే రాష్ట్రంలో కేంద్రప్రభుత్వం ప్రతినిధి అని భావించడమే కావచ్చు. కానీ నిన్న భాజపా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గవర్నర్ పై విరుచుకుపడ్డారు. రాజ్ భవన్ ఉద్యోగుల నివాస సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమను ఆహ్వానించకపోవడం వారి ఆగ్రహానికి కారణం. 

ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి నిన్న హైదరాబాద్ లోని తమ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “గవర్నర్ నరసింహన్ తెరాస సర్కార్ కు ఏజంటులాగ, కేసీఆర్ కు తొత్తులాగ మారిపోయారు. రాజ్ భవన్ ను సి.ఎం.కార్యాలయానికి అనుబంధ విభాగంగా మార్చేశారు. రాజ్ భవన్ ఉద్యోగుల నివాస సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమం తెరాస సర్కార్ స్వంత కార్యక్రమం కాదు. ప్రభుత్వ కార్యక్రమం. దానికి ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలనే సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేకపోతే కనీసం గవర్నర్ నరసింహన్ అయినా ఆ విషయం ఆయనకు చెప్పి ఆహ్వానాలు పంపాలి కదా? కానీ అయన కూడా కేసీఆర్ చెప్పినట్లే నడుచుకొంటున్నట్లున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే దానిని సరిదిద్దవలసిన గవర్నరే తప్పు చేస్తే ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి?” అని ప్రశ్నించారు. 

గవర్నర్ నరసింహన్ పై భాజపా విమర్శలు చూస్తే వేరే ఏదో బలమైన కారణంతోనే చేసినట్లు ఉంది. ఆయన పట్ల దాని మనసులో ఉన్న అసంతృప్తిని వెళ్ళగ్రక్కేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకొన్నట్లు అనుమానించవలసి వస్తోంది. కనుక భాజపా అసంతృప్తికి అసలు కారణం ఏమిటో తెలియవలసి ఉంది. 


Related Post