తెరాస సర్కార్ అంతులేని పోరాటాలు

March 07, 2017


img

ఒకప్పుడు తెలంగాణా కోసం పోరాడిన తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పోరాటాలు చేయక తప్పడం లేదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీతో..మరోసారి తెదేపా, వామవామపక్షాలతో...ఇంకోసారి టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తో...న్యాయస్థానాలతో...కేంద్రంతో.. చంద్రబాబు నాయుడుతో...నిరంతరం పోరాడుతూనే ఉంది. అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ఇటువంటి పోరాటాలు తప్పనిసరే కానీ తెరాస సర్కార్ అవి మరికొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొరుగునే ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ ఒక్కడితో పోరాడితే సరిపోతుంది. కానీ తెరాస సర్కార్ కు ఇంతమందితో పోరాడవలసి వస్తోంది. 

ఏపి సర్కార్ తో ఏదో ఒక వివాదంపై నిరంతర పోరాటాలు చేస్తూనే ఉంది. మల్లన్నసాగర్ భూసేకరణ అంశంపై కాంగ్రెస్ పార్టీతో అది కత్తులు దూయవలసి వచ్చింది. కొన్ని రోజుల క్రితమే నిరుద్యోగ ర్యాలీ విషయంలో టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తో పెద్ద యుద్దమే చేయవలసి వచ్చింది. ఇప్పుడు తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పోరాడుతోంది. 

మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్ లపై రేవంత్ రెడ్డి చాలా తీవ్ర విమర్శలు చేయడంతో, తెరాస సర్కార్ కూడా తప్పని సరిగా ఆయనపై ఎదురుదాడి చేయవలసి వస్తోంది. తెరాస అవినీతి పాలన నుంచి తెలంగాణా రాష్ట్రానికి విముక్తి కల్పించవలసిన అవసరం ఏర్పడిందని, వచ్చే ఎన్నికలలో తెదేపా అధికారంలోకి రాగానే తెరాస సర్కార్ నిర్ణయాలను పునః సమీక్షిస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే తెదేపా నేతలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులతోనే తెదేపా రాష్ట్రంలో చాలా బలహీనపడింది. ఇప్పుడు రాష్ట్రంలో తెదేపా అంటే రేవంత్ రెడ్డి మాత్రమే అన్నట్లుగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో కూడా రేవంత్ రెడ్డి అంత ఆత్మవిశ్వాసం కనబరుస్తూ తెరాసను డ్డీ కొంటుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఆయనపై తెరాస నేతల ఎదురుదాడులు చూసినట్లయితే, తెరాస కూడా ఆయనను తక్కువగా అంచనా వేయడం లేదని అర్ధం అవుతుంది. అయితే తెరాస ఆయన విషయంలో ఎంత ఎక్కువగా స్పందిస్తే ఆయనకు ప్రజలలో అంత ప్రాధాన్యం, గుర్తింపు లభిస్తుందనే సంగతి గమనిస్తున్నట్లు లేదు. టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ విషయంలో అది ఇప్పటికే నిరూపితమైంది. కనుక వన్ మ్యాన్ ఆర్మీ వంటి రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే విషయంలో తెరాస కొంచెం సంయమనం పాటించడం మంచిదేమో!


Related Post