రోహిత్ వేముల తల్లి ఆవేదన తీరేదెన్నడు?

March 06, 2017


img

ఏడాదిన్నర క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయిన హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల ఈ నెల 14 నుంచి ‘దళిత స్వాభిమాన యాత్ర’ పేరిట రెండు తెలుగు రాష్ట్రాలలో యాత్ర మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఆమె తన చిన్న కొడుకు రాజా వేములతో కలిసి వారు సమకూర్చుకొన్న ఒక పికప్ వ్యానులో ఈ యాత్రను చేపట్టబోతున్నారు. వారు దానికి ‘భీమ్ ఆటో’ అనే పేరు పెట్టారు. అది దళితుల స్వాభిమానానికి చిహ్నమని చెప్పారు. తమ యాత్ర రెండు రాష్ట్రాలలో దళిత వాడల గుండా సాగి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ముగుస్తుందని తెలిపారు. ఆమె చిన్న కొడుకు రాజా పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఎస్.సి. ఫస్ట్-క్లాసులో పాసయ్యాడు. కానీ అతనికి సరైన ఉద్యోగం దొరకలేదు. అతనే ఈ వాహనాన్ని నడిపించబోతున్నాడు. 

రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకొని ఏడాదిన్నరపైనే  గడిచినా ఇంతవరకు తమకు న్యాయం జరుగలేదని ఆమె అవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు చావుకు కారకుడైన యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసి జైలుకి పంపించకపోగా, ఆయనకు మళ్ళీ అక్కడే యధాప్రకారం ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం కల్పించడం చాలా అన్యాయమని అన్నారు. 

తన కొడుకు మృతి తనను చాలా కలచి వేయడమే కాకుండా చాలా ఆలోచింపజేసిందని రాధిక అన్నారు. దళితులపై జరుగుతున్న ఈ దౌర్జన్యాలను అరికట్టాలంటే వారిలో చైతన్యం కలిగించి తమ హక్కులను కాపాడుకొనేందుకు పోరాడేలా చేయడం ఒక్కటే మార్గమని ఆమె అన్నారు. అందుకే దాతలు ఇచ్చిన విరాళాలతో ఈ పికప్ వాహనం కొనుకొని దానిలో యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు. తమ ఈ ప్రయత్నంలో ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా తాము ముందుకే సాగాలని నిశ్చయించుకొన్నామని ఆమె చెప్పారు.

రాజా వేముల మాట్లాడుతూ, “ఈ సమాజంలో దళితులకు కూడా మిగిలిన అందరితో సమానంగా స్వేచ్చ, స్వాతంత్ర్యం, సమానహక్కులు కల్పించాలని డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ కలలు కన్నారు...దాని కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ వేధింపులు భరించలేక మా అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడం చూస్తే నేటికీ దళితుల పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టం అవుతోంది. అందుకే అంబేద్కర్ అప్పుడే పోరాట మార్గాన్ని ఎంచుకొని ఉండి ఉంటే బాగుండేదని అన్నయ్య అంటూ ఉండేవాడు,” అని అన్నారు.

వారి ఆవేదన సహేతుకమైనదే. కానీ సమాజాన్ని రాజకీయ పార్టీలు, వాటి నేతలు శాసిస్తున్న ఈ రోజుల్లో వారి గోడు వినేదెవరు? వారికి అండగా నిలబడి న్యాయం కోసం పోరాడేది ఎందరు? ఏమైనప్పటికీ వారి గొంతు ప్రజలకు వినిపించవలసిన అవసరం చాలా ఉంది.


Related Post