ఓటుకు నోటుకేసుపై బాబు ఏమ్మన్నారంటే..

March 06, 2017


img

ఈరోజు సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసుపై విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నోటీస్ పంపించింది. దానిపై రెండువారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వెలగపూడిలో ఇవ్వాళ్ళ ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో దీని గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, “దానిలో కొత్తేముంది. వాళ్ళు కేసులు వేస్తూనే ఉంటారు. వాటిని నేను ఎదుర్కొంటూనే ఉంటాను. గత రెండు దశాబ్దాలలో నామీద 26 కేసులు వేశారు కానీ ఏ ఒక్కదానిలో నన్ను దోషిగా నిరూపించలేకపోయారు. వాటిలో ఇదీ ఒకటి. అసలు ఆ కేసులో ఏముందని మాట్లాడేందుకు?” అని చంద్రబాబు నాయుడు తేలికగా కొట్టి పడేశారు.

ఆయన ఈ కేసును చాలా తేలికగా కొట్టి పడేసినప్పటికీ, ఆ కేసులో ఆయన పాత్ర గురించి అందరికీ తెలుసు. అందరికీ తెలుసనే సంగతి ఆయనకు కూడా తెలుసు. ఆ కేసును ముందుకు సాగనిస్తే తనకు, తన పార్టీ భవిష్యత్ కు చాలా ప్రమాదం కలుగుతుందని కూడా తెలుసు. అందుకే ఆ కేసులో తన పాత్రపై పునర్విచారణ చేయమని తెలంగాణా ఎసిబి కోర్టు ఆదేశించగానే క్షణం కూడా ఆలశ్యం చేయకుండా హైకోర్టులో పిటిషన్ వేసి దానిని ముందుకు సాగనీయకుండా అడ్డుకొన్నారు. ఆ కేసులో తన పాత్ర లేదని ఆయన నిజంగానే భావిస్తున్నట్లయితే, ఆయన ఎసిబికి సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదా? కనుక మళ్ళీ ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో దానిపై స్టే పొందేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు. ఏమైనప్పటికీ ఈ ఓటుకు నోటు కేసు ఆయనను భూతంలా వెంటాడుతూనే ఉంది.


Related Post