ఇక ట్రంప్ సోర్సింగ్ షురూ

March 04, 2017


img

వ్యక్తి కావచ్చు...సమాజం కావచ్చు లేదా దేశం కావచ్చు..స్వావలంబనకు ప్రయత్నించకుండా ఇతరులపై ఆధారపడితే ఏమవుతుందో తెలుసుకోవడానికి, ట్రంప్ నిర్ణయాల కారణంగా ఇప్పుడు భారత్ ఎదుర్కోబోతున్న పెను సమస్యలే చక్కటి ఉదాహరణలుగా కనబడుతున్నాయి. 

విదేశీయులపై ఆంక్షలు, హెచ్ 1-బి వీసాలపై ఆంక్షలు, గ్రీన్ కార్డుల జారీకి ఆంక్షలతో భారతీయ ఐటి సంస్థలు, వాటిలో ఉద్యోగులు, ప్రవాసభారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ నిర్ణయాల ప్రభావం భారత ఆర్ధిక వ్యవస్థపై కూడా పెను ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. 

వీటికి తోడు అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు) లో కాంగ్రెస్ సభ్యులు (ఎంపిలు) జీన్‌ గ్రీన్‌, డేవిడ్‌ మెకిన్లీ శుక్రవారం “యూఎస్‌ కాల్‌సెంటర్‌ మరియు వినియోగదారుల పరిరక్షణ చట్టం” లో సవరణలను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు ఇంకా ఆందోళన కలిగిస్తోంది. 

విదేశాల నుంచి అమెరికాలో వివిధ రంగాలకు అవుట్ సోర్సింగ్ సేవలు అందిస్తున్న అమెరికన్ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు నిలిపివేయడమే కాకుండా వాటిపై అధనంగా పన్నులు వేయాలని ఆ బిల్లులో ప్రతిపాదించినట్లు సమాచారం. 

అమెరికాతో పోలిస్తే భారత్, చైనా, తైవాన్, ఫిలిపిన్స్ వంటి విదేశాలలో తక్కువ జీతాలకే ఉద్యోగులు లభిస్తారు కనుక అమెరికన్ కంపెనీలు అక్కడ అవుట్ సోర్సింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నాయి. ఆ సంస్థలలో సుమారు 1.4 కోట్లు మంది విదేశీయులు పనిచేస్తున్నట్లు అంచనా. అదే ఆ సంస్థలు అమెరికాలో ఏర్పాటు అయ్యుంటే ఆ ఉద్యోగాలన్నీ అమెరికన్లకే దక్కి ఉండేవి. కనుక ఉద్యోగాల విషయంలో చిరకాలంగా అమెరికన్లకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని సరిదిద్దడం కోసమే ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నట్లు కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. 

దీని వలన భారత్ తో సహా చాలా దేశాలలో అవుట్ సోర్సింగ్ సేవలు అందిస్తున్న సంస్థలకు తీవ్ర నష్టం కలుగవచ్చు. కానీ అమెరికా ప్రయోజనాలను కాపాడేందుకు ట్రంప్ ప్రభుత్వం తీసుకొంటున్న ఈ నిర్ణయాన్ని తప్పు పట్టలేము. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం స్వావలంబనే. కనీసం ఇప్పటికైనా ట్రంపును తిట్టుకోవడం ఆపి స్వావలంబనకు భారత్ సర్కార్ గట్టి ప్రయత్నాలు మొదలుపెడితే చాలా మంచిది.


Related Post