ఏపికి కూడా ఓ కేసీఆర్ అవసరం!

March 04, 2017


img

వెలగపూడిలో ఏపి అసెంబ్లీ ప్రారంభోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర విభజన గురించి చెప్పిన మాటలపై కాంగ్రెస్, తెరాస నేతల ఘాటుగానే స్పందించారు. చంద్రబాబుపై మంత్రి ఈటెల రాజేందర్ చేసిన మిగిలిన విమర్శలను పక్కన పెడితే ఆయన చెప్పిన ఒక మాట చాలా ఆసక్తికరంగా ఉంది.

 “రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అది చూసి చంద్రబాబు ఈర్ష్య చెందుతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు కూడా కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండునని అనుకొంటున్నారు,” అని అన్నారు.

ఈటెల చెప్పిన ఈ మాట అబద్దమూ కాదు అతిశయోక్తి కాదు. ఒకప్పుడు కేసీఆర్ ఆంద్ర ప్రజల పట్ల విద్వేషం ప్రదర్శించినప్పటికీ, ఆ తరువాత ఆయన తెలంగాణా అభివృద్ధి మీదే ఎక్కువ దృష్టి పెట్టి అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుపోతుండటం చూసి ఆంధ్రా ప్రజలు కూడా చాలా మెచ్చుకొంటున్నారు. ఆయన పట్ల వారి ఆలోచనలలో మార్పు వచ్చిందనే దానికి గ్రేటర్ ఎన్నికలలో తెరాసకు పట్టం కట్టడమే చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు, మళ్ళీ తిరుపతి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆంధ్రా ప్రజలు అయన పట్ల చూపిన అభిమానం మరొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వారు మనసులో ఏమీ లేకుండానే కేసీఆర్ పట్ల అంత అభిమానం చూపారనుకోలేము. అది మానవీయ దృక్పధంతో ఆయన చేస్తున్న పాలనకు, అభివృద్ధికి లభిస్తున్న గౌరవంగానే భావించవచ్చు. 

ఆ మద్యన కాశ్మీర్ అల్లర్ల సమయంలో వేర్పాటువాదం పతాకస్థాయికి చేరుకొన్నప్పుడు, ఇటువంటి ఆలోచనే కలిగింది. అదే కేసీఆర్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయ్యుంటే ఈ సమస్య ఇంత తీవ్ర రూపం దాల్చనిచ్చేవారా? వేర్పాటువాదాన్ని రూపుమాపి ఆ రాష్ట్రాన్ని జాతీయ స్రవంతిలోకి తీసుకువచ్చి అభివృద్ధి చేసేవారు కదా? అనే ఆలోచన కలిగింది. ఈ ఆలోచన కొంచెం అతిశయోక్తిగా ఉన్నా ఆంధ్రాకే కాదు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా ఒక కేసీఆర్ అవసరమే అనిపిస్తుంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఆలోచనలు, వ్యూహాలు, ప్రతిపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు వంటివన్నీ పక్కన పెట్టి చూసినట్లయితే, ఆయనలో తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తీవ్ర తపన, ఆ ఆలోచనలను యధాతధంగా అమలు చేయగల దీక్షాదక్షతలు, అంకితభావం అన్నీ కనబడతాయి. అందుకే కేవలం రెండున్నరేళ్ళలోనే తెలంగాణాలో అభివృద్ధి కళ్ళకు కనబడుతోంది. కొత్తగా ఏర్పడినప్పటికీ తెలంగాణా రాష్ట్రం పేరు, ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మారుమ్రోగిపోతోంది. దీనిని ప్రతిపక్షాలు అంగీకరించకపోవచ్చు. కానీ నిజం అని ఆంధ్రా ప్రజల అభిమానమే చెపుతోంది. 


Related Post