ఆ విషయంలో అందరూ దొందూ దొందే..

March 03, 2017


img

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన గురించి అన్న మాటలు మళ్ళీ అందరినీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకు వెళ్ళాయని చెప్పవచ్చు.  

విశేషం ఏమిటంటే, రాష్ట్ర విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వస్తున్న సమయంలో కూడా తెలంగాణాలో రాజకీయ పార్టీలు, నేతలు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజలు అందరూ ఒకే గొంతుతో నినదిస్తూ పట్టిన పట్టు వీడకుండా రాష్ట్రాన్ని సాధించుకొంటే, ఏపిలో తెదేపా, వైకాపా, కాంగ్రెస్, కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ, కాంగ్రెస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు అందరూ కలిసి ఆంధ్రా ప్రజలను చివరి నిమిషం వరకు మభ్యపెడుతూ మోసగించారని చెప్పక తప్పదు. 

జగన్మోహన్ రెడ్డి విభజన అనివార్యమని గ్రహించినందునే రాత్రికి రాత్రే తెలంగాణా నుంచి మూటాముల్లె సర్దుకొని ఆంధ్రాకు వచ్చేశారు. కానీ ఆంధ్రా ప్రజలలో నెలకొన్న సమైక్య సెంటిమెంటును సొమ్ము చేసుకొని అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రం విడిపోకుండా అడ్డుకొంటానని ఆంధ్రా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే సమైక్యడ్రామాలు ఆడారని చెప్పక తప్పదు. అందుకే ఎన్నికలు పూర్తయిన తరువాత ఆయన మళ్ళీ ఎప్పుడూ రాష్ట్ర విభజన గురించి మాట్లాడింది లేదు.   

సమైక్య రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా రాష్ట్ర విభజన అనివార్యమని తెలుసు. కానీ చివరి నిమిషం వరకు రాష్ట్రం విడిపోకుండా అడ్డుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆంధ్రా ప్రజలను మభ్యపెట్టారు. కానీ అయన తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుపడుతున్నారని ఆయనపై తెలంగాణా ప్రజలకు పీకల వరకు కోపం ఉంది. కానీ నిజానికి అయన రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకే చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్ అధిష్టానానికి వీర విధేయుడైన కిరణ్ కుమార్ రెడ్డి బహుశః దాని ఆదేశానుసారమే ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రప్రభుత్వానికి అవసరమైన సహాయసహకరాలన్నీ అందించారు. 

ఎందుకైనా మంచిదని రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని శపథం చేశారు. కానీ చివరి నిమిషంలో తన అదృష్టాన్ని మరొక్కమారు పరీక్షించుకొందామనే ఆలోచనతో పార్టీ పెట్టి భంగపడ్డారు. ఆయన తమను మోసగించారని ప్రజలు నమ్మినందునే తిరస్కరించారని చెప్పవచ్చు. ఎలాగూ రాజకీయ సన్యాసం ప్రతిజ్ఞ చేశారు కనుక అదే పని చేశారు. అదే మంచి నిర్ణయం కూడా. 

ఈవిధంగా ఆంధ్రాలో రాజకీయ పార్టీలు, నేతలు, ఎంపిలు అందరూ కలిసి ప్రజలను మోసగించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేశారని చెప్పక తప్పదు. కానీ దురదృష్టం ఏమిటంటే మళ్ళీ వారిలో నుంచే ఒకరిని ఎన్నుకోవలసి రావడం. 


Related Post