కలెక్టరు కాదు..జగనే జైలుకి?

March 01, 2017


img

కృష్ణా జిల్లాలో నిన్న జరిగిన బస్సు ప్రమాదంపై జగన్ ప్రదర్శించిన అత్యుత్సాహం అసలు సమస్య పక్కకు పోయి దాని స్థానంలో తెదేపా, వైకాపాల మద్య రాజకీయ యుద్ధం మొదలైంది. 

జగన్ నిన్న నందిగామ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులను దుర్భాషలాడి వారి చేతిలో నుంచి బస్సు డ్రైవర్ పోస్ట్ మార్టం రిపోర్టును లాకొన్నారు. తనకు అడ్డుపడిన జిల్లా కలెక్టరు అహ్మద్ బాబును సెంట్రల్ జైలుకి పంపిస్తానని బెదిరించారు. పోస్ట్ మార్టం తరువాత బస్సు డ్రైవర్ శవాన్ని పోలీసులు తరలిస్తున్నప్పుడు వారిని కూడా అడ్డుకొన్నారు. ఇవన్నీ చట్టప్రకారం నేరాలే కనుక జగన్ తో సహా 10 మంది వైకాపా నేతలపై పోలీసులు సెక్షన్స్: 353, 346, 143, 149 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. 

నిజానికి ఈ సంఘటనలో తెదేపా ప్రభుత్వం, సదరు బస్సు యజమానులైన తెదేపా ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి, తెదేపా ఎంపి దివాకర్ రెడ్డి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంది. కానీ జగన్ దుందుడుకుగా వ్యవహరించి వారినందరినీ ఒడ్డున పడేశారు. జిల్లా కలెక్టరును జైలుకి పంపిస్తానని బెదిరించి ఇప్పుడు తను, తనతోబాటు వైకాపా నేతలను కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి చేజేతులా కల్పించుకొన్నారు. 

ఈ బస్సు ప్రమాదానికి అసలైన కారణాలు ఏమిటి? దానికి ఎవరు బాధ్యులు?ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మృతులు, గాయపడినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఎంత.. ఎవరు చెల్లించాలి? మొదలైన అంశాల గురించి ఆలోచిస్తున్న ప్రజలను జగన్ ఓవర్ యాక్షన్ తో వారి దృష్టిని మళ్ళించారు. తెదేపా ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా జగన్ స్వయంగా అందించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అతనిపై కేసులు నమోదు చేయించి ప్రజల దృష్టిని దానిపైకి మళ్ళించి ఈ సమస్య నుంచి చాలా అలవోకగా బయపడింది. ఊహించినట్లుగానే “జగన్ ఇప్పుడే అధికారులతో ఒక వీధి రౌడీలాగా దురుసుగా ప్రవర్తిస్తుంటే..ఒకవేళ అధికారంలోకి వస్తే ఇంకెలా ప్రవర్తిస్తాడో? అని తెదేపా నేతలు విమర్శలు చేస్తున్నారు. వారికి ఈ అవకాశం కల్పించింది కూడా జగనే అని చెప్పకతప్పదు. 


Related Post