పాపం రాహుల్ గాంధీ!

February 28, 2017


img

గత 27 సం.లుగా యుపిలో అధికారంలోకి రాలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనుకొంది కానీ కాంగ్రెస్ కి ఇంకా ‘రాహు’కాలం నడుస్తోంది కనుక మొదటి రోజు నుంచే సమస్యలు మొదలయ్యాయి. వారణాసిలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన సోనియా గాంధీ కళ్ళు తిరిగి పడిపోయారు. ఆమె ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోవడంతో ఎన్నికల ప్రచారానికి రాలేదు. ప్రియాంక వాద్రా వచ్చి ప్రచారం చేస్తారనుకొంటే ఆమె ఆమేది, రాయ్ బరేలీలో ప్రచారం చేసి ఇంటికి వెళ్ళిపోయారు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని ప్రియాంకా వెళ్ళిపోయారా లేక ఈ ఎన్నికలలో కాంగ్రెస్-ఎస్.పి.కూటమి ఓటమి ఖాయం అని గ్రహించే వెళ్ళిపోయారో త్వరలోనే తెలియవచ్చు. 

ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా మొదట తన పేరును ప్రకటించి, ఆనక సమాజ్ వాదీ పార్టీతో పొత్తులు పెట్టుకొని తనకు హ్యాండిచ్చినందుకు షీలా దీక్షిత్ కూడా అలిగి ప్రచారానికి రావడం లేదు. ఏమంటే ఆరోగ్యం బాగోలేదని చెపుతున్నారు. పైగా ఎన్నికలలో చాలా కీలకమైన సమయంలో “రాహుల్ గాంధీకి అంత రాజకీయ పరిణతి లేదు..చాలా నేర్చుకోవాలి..కనుక అతనికి మరి కొంచెం టైం ఇవ్వాలి,” అంటూ రాహుల్ గాలి తీసేశారు. 

ఈ పరిస్థితులలో రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ చెయ్యి పట్టుకొని తిరుగుతుంటే ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గులాం నబీ ఆజాద్ “వాళ్ళిద్దరూ సమానమే ఒకరు ఎక్కువా కాదు..మరొకరు తక్కువా కాదు,” అని ఒక అసందర్భమైన మాటనేసి అని ప్రజలను ఆలోచింపచేశారు. 

ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ –ఎస్.పి. కూటమి ఓడిపోయినట్లయితే, కాంగ్రెస్ తో జత కట్టడం వలననే తాము ఓడిపోయామని అఖిలేష్ యాదవ్ తో సహా అందరూ నిందించకమానరు. ఎన్నికలలో ఓడిపోయి, మళ్ళీ ఆ ఓటమికి రాహుల్ గాంధీయే బాధ్యత తీసుకోవలసివస్తే, షీలా దీక్షిత్ చెప్పినట్లు కాంగ్రెస్ పగ్గాలు చెప్పట్టడానికి రాహుల్ గాంధీ మరి కొంత కాలం ఆగక తప్పదేమో? రాహుల్ గాంధీకి ఆ పేరు ఎందుకు పెట్టారో కానీ సార్ధకనామధేయుడు అనిపించుకొంటున్నారు. ఎన్నేళ్ళు ఆగినా ‘రాహు కాలం’ పూర్తవడంలేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదు. పాపం రాహుల్ గాంధి!  


Related Post