ట్రంప్ ఇకనైనా మేలుకో: హిల్లరీ క్లింటన్

February 28, 2017


img

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీకి దిగినప్పటి నుంచే ‘విభజించి పాలించు’ అనే విధానాన్ని అవలంభిస్తూ అమెరికాలో అసంతృప్తి వర్గ ప్రజలను తనవైపు తిప్పుకొని అధికారంలోకి రాగలిగారు. అమెరికా అధ్యక్షుడు అవ్వాలనే ఆయన ఆశయం నెరవేరింది కనుక ఇకనైనా ట్రంప్ తన వేర్పాటువాదాన్ని పక్కనుపెట్టి అందరినీ కలుపుకుపోతారని అందరూ ఆశిస్తే, ఆయనలో వేర్పాటువాదం ఇంకా కరుడుకట్టడమే కాక ఇప్పుడు అది సామాన్య ప్రజలకు కూడా పాకుతోంది. తత్ఫలితంగా ఇప్పుడు విదేశీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. ట్రంప్ విధానాలను దేశ వ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వంలోని అధికారులు ఎంతగా వ్యతిరేకిస్తున్నా ఆయన తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు సాగిపోతుండటం విస్మయం కలిగిస్తుంది. 

డోనాల్డ్ ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టారు. అంటే ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాలేదన్న మాట. ఈ 50 రోజులలోనే అమెరికాలో పరిస్థితులు పూర్తిగా తారుమారు అయిపోయాయి. ఒకప్పుడు భూతల స్వర్గం అనుకొన్న అమెరికాలో భయం భయంగా బ్రతుకవలసి వస్తోంది. ఎప్పుడు, ఎక్కడ ఎవరి మీద దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది అమెరికాకు గౌరవప్రదమేనా? అని పాలకులు ఆలోచించాలి. 

ట్రంప్ తో పోటీ పడిన హిల్లరీ క్లింటన్ ఈ పరిస్థితులపై చాలా తీవ్రంగా స్పందించారు. “దేశంలో జాతి విద్వేషం, బెదిరింపులు చాలా పెరిగిపోతున్నాయి. వాటిని తక్షణమే అదుపు చేయాలని వైట్ హౌస్ కు మనం చెప్పవలసిన అవసరం లేదు,” అని ట్వీట్ చేశారు. 

అమెరికన్లకు ఉద్యోగాలలో తప్పక ప్రాధాన్యత ఈయవలసిందే. అందు కోసం విదేశీయుల రాకను నియంత్రించవలసిందే. అమెరికాకు అక్రమ వలసలు అరికట్టవలసిందే. కానీ ఇవన్నీ రాత్రికి రాత్రే చేయదగ్గ పనులు కావు. గల్ఫ్ దేశాలలో కూడా కొన్ని లక్షల మంది విదేశీయులు పనిచేస్తున్నారు. కానీ అక్కడి ప్రభుత్వాలు ట్రంప్ సర్కార్ లాగ దుందుడుకుగా వ్యవహరించకుండా దశలవారిగా స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. తమ దేశాలలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల చేతనే స్థానికులకు శిక్షణ ఇప్పించి క్రమంగా వారి స్థానంలో స్థానికులను భర్తీ చేసుకొంటున్నాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాలలో వివిధ రంగాలలో స్థానికులే ఎక్కువగా పనిచేస్తున్నారు. గల్ఫ్ దేశంలో ఈ ప్రక్రియ ఇంత సజావుగా, నిశబ్దంగా జరిగినప్పుడు, మేధావి దేశంగా చెప్పుకొంటున్న అమెరికా మాత్రం చాలా అయోమయంగా వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 

రౌతును బట్టే గుర్రం అంటారు. ట్రంప్ తీరు వలన అమెరికాలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడటమే కాకుండా, వాటి కారణంగా అది ప్రపంచ దేశాల ముందు తలదించుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక ట్రంప్ తీరు మారకపోతే ఆయనను గాడిన పెట్టవలసిన బాధ్యత అమెరికన్ కాంగ్రెస్ దే! 


Related Post