కాంగ్రెస్ దయతో తెలంగాణా ఏర్పడిందా?

February 28, 2017


img

కాంగ్రెస్ హయంలో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన మాట వాస్తవం. కనుక ఆ క్రెడిట్ తమకే స్వంతం అని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటారు. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు కూడా. నిజానికి ఆ క్రెడిట్ దక్కించుకోవడంలో వారే విఫలం అయ్యారని చెప్పవచ్చు. 

తెలంగాణా ఎందువల్ల ఏర్పరచవలసి వచ్చిందో అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ నేతలు నేటికీ సోనియా గాంధీ దయ వలన ఏర్పాటయిందని చెప్పుకొంటుంటారు. అయినా వారిని ఎవరూ గట్టిగా నిలదీసి అడిగేవారు లేరు. మహబూబ్ నగర్ లో సోమవారం జరిగిన జన ఆవేదన సభలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పకతప్పదు. 

“తెలంగాణా సాధన కోసం కేసీఆర్ దొంగ దీక్ష చేశారు. అప్పుడు నేను కేంద్రమంత్రిగా ఉన్నందున ఆయన దీక్ష గురించి పూర్తి నివేదిక, వీడియో క్లిప్పింగులు కూడా తెప్పించుకొని చూసి అది దొంగ దీక్షేనని నిర్ధారణ చేసుకొన్నాను. అది తప్పేనని కేసీఆర్ కూడా ఒప్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇవ్వకుంటే కేసీఆర్ భవిష్యత్ ఏమై ఉండేదో ఆలోచించుకొంటే మంచిదని నా సలహా,” అన్నారు జైపాల్ రెడ్డి.

కేసీఆర్ సుమారు ఒక దశాబ్దంపైగా తెలంగాణా ఉద్యమాలు నడిపించారు. ఎన్ని అవమానాలు, అవహేళనలు, అవరోధాలు ఎదురైనప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు..తన లక్ష్యాన్ని మరిచిపోలేదు. పదేళ్ళ కాలంలో జైపాల్ రెడ్డి ఏనాడూ ఉద్యమాలకు మద్దతుగా మాట్లాడలేదు. కనీసం అవి చివరిదశకు చేరుకొన్నప్పుడైనా తెలంగాణా ఏర్పాటు చేయాలని ధైర్యంగా అడగలేకపోయారు. కేంద్రమంత్రిగా ఉన్నందున ఆవిధంగా మాట్లాడలేనని స్వయంగా చెప్పుకొన్నారు కూడా. అంటే తెలంగాణా ఏర్పాటు కంటే తన మంత్రి పదవికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అర్ధం అవుతోంది. 

చివరి నిమిషం వరకు మంత్రిపదవిని పట్టుకొని ప్రాకులాడిన ఆయన తెలంగాణా సాధన కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నాలను తప్పు పట్టడం అతిపెద్ద తప్పు. కాంగ్రెస్ దయతోనే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పడం ఇంకా పెద్ద తప్పు. 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఏర్పాటుచేయకపోతే కేసీఆర్ భవిష్యత్ ఏమయ్యేది? అని ప్రశ్నించడం కంటే కాంగ్రెస్ భవిష్యత్ ఏమయ్యేది? అని ప్రశ్నించుకోవాలి. తమ ప్రభుత్వ హయంలోనే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు తమని ఎందుకు తిరస్కరించారు? కేసీఆర్ మొహం చూసి తెరాసకే ఎందుకు ధికారం కట్టబెట్టారు?అని కాంగ్రెస్ నేతలు ఆలోచించుకొంటే ఈవిధంగా అనుచితంగా మాట్లాడి ఉండేవారు కాదు. 

ప్రజాభిప్రాయలను, వారి మనోభావాలను పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణా సాధన కోసం ప్రజా ఉద్యామాన్ని పట్టించుకోకుండా తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటూ తెలంగాణా ఏర్పాటు చేసినందుకు తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. 

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల చేత తిరస్కరించబడి క్రమంగా తన ఉనికిని కోల్పోతున్న ఈ క్లిష్ట సమయంలోనైనా కాంగ్రెస్ నేతలు తమ పొరపాట్లకు పశ్చాతాపపడకపోగా, ఇంకా అనుచితంగానే మాట్లాడుతున్నారు. కనుక వారు కేసీఆర్ భవిష్యత్ కోసం కాక తమ భవిష్యత్ గురించి ఆలోచించుకోవడం మంచిది. 


Related Post