ట్రంప్ దయాదాక్షిణ్యాలు మనకెందుకు?

February 27, 2017


img

ఒకప్పుడు భారత్ వ్యవసాయ, కుటీర పరిశ్రమల ఆధారిత దేశంగా ఉన్నప్పుడు మనం ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం ఉండేది కాదు. ఆ తరువాత క్రమంగా పరిశ్రమల స్థాపన జరిగి ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు కూడా ఎవరిపై ఆధారపడనవసరం ఏర్పడలేదు. ఎందుకంటే దేశంలో ఉత్పత్తి అవుతున్న వివిధ ఉత్పత్తులన్నిటినీ పూర్తిగా వినియోగించుకొనేందుకు కోట్లాది మంది జనాభా ఉన్నారు కనుక.

ఆ తరువాత దేశంలోకి కంప్యూటర్లు ప్రవేశించి ఐటి రంగానికి డిమాండ్ ఏర్పడినప్పుడు కూడా అనేక లక్షలమంది భారతీయులు ఆ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని వృద్ధిలోకి వచ్చారు. అనేక చిన్నా పెద్దా ఐటి సంస్థలు కూడా ఈ అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకొని విదేశాలకు సైతం తమ వ్యాపారాలను విస్తరించాయి. కానీ ఐటి మోజులో పడి దేశానికి జీవనాడి వంటి వ్యవసాయం, ఉత్పత్తి రంగాలను చాలా నిర్లక్ష్యం చేయడం, మళ్ళీ దాని కోసం పరాయి దేశాలపైనా ఎక్కువగా ఆధారపడటం మొదలుపెట్టినప్పటి నుంచి మన ఆర్ధిక వ్యవస్థపై ఇతరదేశాల నిర్ణయాలు ప్రభావం చూపుతున్నాయి.

అందుకు తాజా ఉదాహరణగా అమెరికాలో హెచ్1-బి వీసాలపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదించిన సరికొత్త ఆంక్షలు, అమెరికన్లకే ఉద్యోగాలలో ప్రాధాన్యత ఈయాలనుకోవడం, ఏడు దేశాలపై ట్రావెల్ బ్యాన్, గ్రీన్ కార్డు హోల్డర్ల సంఖ్యను క్రమంగా తగ్గించాలనుకోవడం వంటివన్నీ మన ఐటి సంస్థలు, వాటిలో పనిచేస్తున్న ఐటి ఉద్యోగులు, అమెరికాలోని ప్రవాసభారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మళ్ళీ ఇవన్నీ మన ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

మనం మన సంప్రదాయ ఆదాయవనరులైన వ్యవసాయాన్ని, కుటీర పరిశ్రమలను, ఉత్పత్తి రంగాన్ని చిన్న చూపు చూస్తూ ఐటి రంగం, విదేశీ చదువులు, ఉద్యోగాలపై విపరీతమైన మోజు పెంచుకోవడం వలననే ఈ సమస్య ఏర్పడిందని స్పష్టం అవుతోంది.  

ఈ సమస్యను ప్రధాని నరేంద్ర మోడీ ముందే ఊహించినట్లుగా, ఉత్పత్తి రంగానికి పెద్ద పీట వేస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’ అనే పధకాన్ని చేపట్టారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు, పోర్టులు, జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలికవసతుల కల్పన వంటి అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఇవన్నీ లక్షలాది మందికి ఉపాధి మార్గం చూపేవేనని వేరే చెప్పనవసరం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిశ్రమల స్థాపనకు పోటాపోటీగా అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు మొదలుపెట్టాయి. దేశంలో అన్ని రాష్ట్రాలు ఇదే విధానాలను అవలంభిస్తే మళ్ళీ మన దేశం స్వయంసంవృద్ధి సాధించి దృడంగా నిలబడుతుంది. అయితే వీటన్నిటికీ అధికారులలో అలసత్వం, అవినీతి, లంచగొండితనం ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. ఈ సమస్యను అన్ని ప్రభుత్వాలు గుర్తించాయి కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవినీతిని అరికట్టలేకపోతున్నాయి. కనుక దేశంలో పారిశ్రామికాభివృద్ధి గురించి మాట్లాడేముందు ఈ సమస్యను ఏవిధంగా అధిగమించాలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించవలసి ఉంటుంది.  


Related Post