హమ్మయ్య! పెద్దాయన మద్దతు దొరికింది!

February 27, 2017


img

టీ-కాంగ్రెస్ నేతల ప్రత్యేకత ఏమిటంటే ఒకపక్క తెరాస సర్కార్ తో పోరాడూతూనే మళ్ళీ వారిలో వారే కుమ్ములాడుకొంటుంటారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచూ విమర్శలు చేస్తూనే ఉంటారు. కానీ వాటిపై ఆయన నేరుగా స్పందించకుండా పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేస్తుంటారు. దిగ్విజయ్ సింగ్ ద్వారా ఓసారి హెచ్చరించారు కానీ వెంకటరెడ్డి మాత్రం తన విమర్శలు ఆపడం లేదు. కనుక అతనికి ఏవిధంగా అడ్డుకట్ట వేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ఉత్తం కుమార్ రెడ్డికి పార్టీలో పెద్దాయనగా పేరొందిన జైపాల్ రెడ్డి అండగా నిలబడి మాట్లాడి చాలా స్వాంతన కలిగించారు. షాద్ నగర్ లో ఆదివారం జరిగిన జన ఆవేదన సభలో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ “ఉత్తం కుమార్ రెడ్డి చాలా సమర్ధుడైన నేత. కనుక ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటుంది,” అని అన్నారు. 

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిస్తే జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుదామని కలలు కన్నారు. కానీ పార్టీలో కొందరు టికెట్ల కోసం, మరికొందరు పిసిసి అధ్యక్ష పదవి కోసం డిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేయడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపడం వలన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కనుక కనీసం వచ్చే ఎన్నికలలోనైనా పార్టీ గెలిస్తే, ముఖ్యమంత్రి కావాలని ఆశపడేవాళ్ళు జైపాల్ రెడ్డితో సహా పార్టీలో కనీసం ఒక డజను మంది వరకు ఉంటారు. 

కొన్ని రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. అప్పుడు కె.జానారెడ్డి ముఖ్యమంత్రి అవడం కూడా ఖాయమే” అని అన్నారు. ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్న జైపాల్ రెడ్డికి ఈ వ్యాఖ్యలు కొంచెం బాధ కలిగించి ఉండవచ్చు. కనుక కోమటిరెడ్డి  వ్యతిరేకిస్తున్న ఉత్తం కుమార్ రెడ్డికి అండగా నిలబడినట్లున్నారు. అంటే జానా, కోమటి ఒక గ్రూప్ అనుకొంటే ఉత్తం, జైపాల్ మరో గ్రూపు అనుకోవాలేమో? ఒకవైపు నానాటికీ పార్టీ బలహీనపడుతున్నా కాంగ్రెస్ నేతలలో ఐక్యత సాధించలేకపోతున్నారు. పైగా మీడియా సమక్షంలో ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకొంటున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాదించడం కష్టమే.   


Related Post