దొడ్డిదారిన లోకేష్ ఎంట్రీ!

February 27, 2017


img

చంద్రబాబు వారసుడుగా చెప్పుకోబడుతున్న నారా లోకేష్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వంలోకి ప్రవేశించబోతున్నారు. అది రాజ్యాంగబద్దమైనదే కావచ్చు..చాలా సేఫ్ ల్యాండింగ్ ఏర్పాటు కావచ్చు కానీ ఏమాత్రం సమర్ధనీయం కాదు. భవిష్యత్ లో తెదేపాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలవలసిన వ్యక్తిగా చెప్పబడుతున్న లోకేష్, ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి గెలిచి తన సమర్ధతను నిరూపించుకొని మంత్రి పదవి చేపట్టి ఉండి ఉంటే అది ఆయనకు చాలా హుందాగా ఉండేది. తెదేపాకు గౌరవంగా ఉండేది. కానీ లోకేష్ దొడ్డిదారిన ప్రభుత్వంలోకి ప్రవేశించబోతున్నారు.

అసమర్ధుడు, తల్లి చాటు పిల్లాడని ముద్ర వేయించుకొన్న రాహుల్ గాంధీ కూడా ప్రత్యక్ష ఎన్నికలలోనే పోటీ చేసి విజయం సాధిస్తుంటే, నారా లోకేష్ దొడ్డి దారిన ప్రభుత్వంలోకి ప్రవేశిస్తున్నారు. తద్వారా లోకేష్ తను తండ్రిచాటు పిల్లాడినని చాటుకొన్నట్లుంది. 

తెలంగాణా ముఖ్యమంత్రి కుమారుడు కేటిఆర్ అన్ని విధాలుగా తన సత్తాను, నాయకత్వ లక్షణాలను చాటుకొని మంత్రి అయ్యారు. మంత్రిగా కూడా తన సత్తా చాటి చూపిస్తూనే ఉన్నారు కనుకనే ఎవరూ ఆయనను వేలెత్తి చూపలేకపోతున్నారు. 

నారా లోకేష్ ను దొడ్డిదారిన ప్రభుత్వంలోకి తీసుకువచ్చి మంత్రిగా చేసి చంద్రబాబు, తెదేపా నేతలు చాలా సంతోషపడవచ్చు...ఏదో ఘనకార్యం చేసినట్లు గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తిని ఏ కుర్చీలో కూర్చొబెట్టినా రాణించలేడు కనుక భవిష్యత్ లో తెదేపాకే నష్టం కలిగించవచ్చు. 

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తాను ముఖ్యమంత్రి కావడం తన జన్మహక్కుగా భావించి, ప్రయత్నించి భంగపడ్డారు. కానీ ఈ పదేళ్ళ కాలంలో తన సమర్ధతను, నాయకత్వ లక్షణాలను చక్కగా నిరూపించుకోగలిగారనే విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. లోకేష్ కూడా ఆవిధంగా తన స్వశక్తితో ప్రభుత్వంలోకి ప్రవేశించి ఉండి అది ఆయనకు, తెదేపాకు కూడా చాలా గౌరవంగా ఉండేది. మేలు కలిగించేది. 


Related Post