ప్రజల పేరుతో రాజకీయ యుద్దాలు?

February 27, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు, జెఎసి మద్య జరుగుతున్న మాటల యుద్ధం రోజురోజుకీ తీవ్రం అవుతోంది. తెదేపా, కాంగ్రెస్, వామపక్షాలు తమ ఉనికి చాటుకొని ప్రజలను ఆకట్టుకోనేందుకే సభలు, పాదయాత్రలు చేస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. వాటి విమర్శలు ఆరోపణల వలన తమ పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుందనే భయంతోనే తెరాస ఎదురు దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. వాటి యుద్ధాలు చూస్తుంటే అప్పుడే ఎన్నికలు వచ్చేసాయన్నట్లున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు, తెరాస నేతలు ప్రతిపక్షాలకు చాలా ఘాటుగా సమాధానాలు ఇస్తూ తమని తాము సమర్ధించుకోవడం గమనించినట్లయితే, వారి మద్య సాగుతున్న ఈ పరస్పర విమర్శలు, ఆరోపణల వలన రాష్ట్రానికి, ప్రజలకు కొత్తగా ఒరిగేదేమీ ఉండదని అర్ధం అవుతోంది. తెరాస ఒకప్పుడు ఆంధ్రా పాలకులతో పోరాడేది..ఇప్పుడు తెలంగాణాకే చెందిన నేతలతో పోరాడుతోంది. అంతే తేడా!

ప్రతిపక్షాలు రాజకీయ దురుదేశ్యంతోనే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయని అనుకొన్నా రాజకీయాలతో సంబంధం లేని ప్రొఫెసర్ కోదండరామ్ వంటి వ్యక్తులు చేస్తున్న విమర్శలు, సందిస్తున్న ప్రశ్నలకు తెరాస సర్కార్ సూటిగా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసి ఉండి ఉంటే చాలా గౌరవంగా ఉండేది. ప్రజలలో దాని విశ్వసనీయత ఇంకా పెరిగి ఉండేది. కానీ తెరాస నేతలు, మంత్రులు ఆయనపై ఎదురుదాడి చేసి నోరు మూయించాలని ప్రయత్నిస్తున్నందున ప్రజలలో ఇంకా అనుమానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని గ్రహించడం మంచిది. 

ఇంతకు ముందు సమైక్య రాష్ట్రాన్ని పాలించిన తెదేపా, కాంగ్రెస్ పార్టీలను సన్నాసులు, అవినీతిపరులు, అసమర్ధులు, దొంగల ముఠాలు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా అందరూ తీవ్రపదాలతో దూషిస్తుంటారు. మళ్ళీ అవే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, నేతలను తెరాసలోకి ఫిరాయింపజేయడమే కాకుండా దానిని చాలా గట్టిగా సమర్ధించుకొంటుంటారు. తెరాస సర్కార్ లో ఇప్పుడు సగం మంది ఆ రెండు పార్టీల వాళ్ళే ఉన్నారు కనుక గత ప్రభుత్వాలను తెరాస నేతలు ఎంత తీవ్రంగా దూషిస్తే వారు తమ ప్రభుత్వాన్ని అంతగా దూషించుకొన్నట్లు అవుతుందని చెప్పవచ్చు. పక్కనే కాంగ్రెస్, తెదేపా నేతలను పెట్టుకొని వారి ప్రభుత్వాలని తిడుతుంటే వాటిలో పనిచేసి వచ్చినవారు బాధపడతారని తెరాస నేతలకు తెలియదనుకోలేము. కనుక తెరాసలో ఆ రెండు పార్టీల నేతలకు ఎంత గౌరవం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజాసమస్యల పేరుతో అధికార ప్రతిపక్షాలు చేసుకొంటున్న ఈ రాజకీయ యుద్దాల వలన రాష్ట్రానికి ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ ఉండదని చెప్పవచ్చు. 


Related Post