జాబ్ మేళా కాదు..నిరుద్యోగులతో చెలగాటం!

February 27, 2017


img

హైదరాబాద్ లోని ఉప్పల్ వద్ద గల లిటిల్ ఫ్లవర్ కాలేజీలో ఆదివారం జరిగిన జాబ్ మేళా రసాభాసగా మారింది. ఆదిత్యసేవా ఫౌండేషన్ అనే సంస్థ అధ్వర్యంలో నిర్వహించబోయే ఈ జాబ్ మేళాలో విప్రో, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలు నియామకాలు చేపట్టబోతున్నాయని సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేసింది. తెలంగాణాతో సహా ఆంధ్రాలోని అనేక జిల్లాల నుంచి సుమారు 10,000 మంది దానికి హాజరయ్యారు. ‘గెట్‌ మై జాబ్‌. కామ్‌’ సంస్థ ఒక్కొకరి వద్ద నుంచి రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసింది. కానీ నిన్న జరిగిన ఆ జాబ్ మేళా కేవలం సెక్యూరిటీ గార్డులు, ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏజంట్ల కోసం మాత్రమే నిర్వహించడంతో చాలా దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసల కోర్చి అక్కడికి వచ్చిన నిరుద్యోగులు ఆగ్రహంతో నిర్వాహకులపై దాడి చేశారు. కాలేజీలో పూల కుండీలు, ఫర్నీచర్ ద్వంసం చేశారు. తరువాత వారు ఉప్పల్ రోడ్డుపై బైటాయించి ధర్నా చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. 

ఆ సంగతి తెలుసుకొని అక్కడికి చేరుకొన్న పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు మల్కజ్ గిరి డిసిపి రమేష్ వచ్చి నిరుద్యోగులకు నచ్చచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

అనంతరం నిరుద్యోగుల పిర్యాదు మేరకు జాబ్ మేళా నిర్వాహకుడు ఎన్. కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి అతనిపై సెక్షన్స్: 406, 188 క్రింద కేసులు నమోదు చేశారు. పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా జాబ్ మేళా నిర్వహణకు అనుమతించినందుకు లిటిల్ ఫ్లవర్ కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు డిసిపి రమేష్ చెప్పారు. 

రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలో చాల చోట్ల ఇటువంటి మోసాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. నిరుద్యోగుల బాధలను, బలహీనతలను అవి సొమ్ము చేసుకొంటూ వారి జీవితాలతో ఈవిధంగా చెలగాటం ఆడుతున్నప్పటికీ వాటిని అడ్డుకొనేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చట్టాలు, నియమనిబంధనలు  రూపొందించకపోవడం చాలా శోచనీయం. ఆ కారణంగా నిరుద్యోగులు పదేపదే ఇటువంటి బోగస్ సంస్థల చేతుల్లో మోసపోవడం, వారి ఆగ్రహం చల్లార్చడానికి పోలీసులు కేసులు నమోదు చేయడం అంతా ఒక నాటకంలాగ సాగిపోతోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నా కనీసం ఇటువంటి బోగస్ సంస్థలకు అడ్డుకట్టవేయకపోవడం శోచనీయం. కనీసం ఇప్పటికైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఇటువంటి నేరాలను అరికట్టేందుకు తగిన చట్టాలు చేయాలి. పోలీస్ వ్యవస్థలు కూడా ఇటువంటి నేరాలు జరిగిన తరువాత దోషులపై చర్యలు చేపట్టడం కాక, ఇటువంటి బోగస్ సంస్థలపై నిఘా ఉంచి ముందుగానే వాటిని అడ్డుకొనే ప్రయత్నం చేయాలి.


Related Post