రాహుల్ ఇంకా పరిణతి చెందలేదు: షీలా దీక్షిత్

February 24, 2017


img

సీనియర్ కాంగ్రెస్ నేత, 15 ఏళ్ళ పాటు డిల్లీని ముఖ్యమంత్రిగా పాలించిన షీలా దీక్షిత్ ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు క్లుప్తంగా:  

ప్రశ్న: రాహుల్ ఎంతగా శ్రమిస్తున్నా కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతోందే తప్ప ఎందుకు ఎదగడం లేదు? 

షీలా దీక్షిత్:  గత కొన్నేళ్ళుగా రాజకీయాల తీరు, నేతల బాష అన్నీ చాలా వేగంగా మారుతున్నాయి. ప్రధాని మోడీ పార్లమెంటులో మాజీ ప్రధానిపై చేసిన అనుచిత వ్యాఖ్యలే అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కనుక ఈ మార్పులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సర్దుబాటు చేసుకొనే ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీ ఇంకా చిన్న పిల్లవాడే. అతనికి తగినంత రాజకీయ పరిణతి రాలేదు. 40 ఏళ్ళ వయసుకు తగిన పరిణతిని మాత్రమే ప్రదర్శిస్తున్నాడు. కనుక అతనికి మరికొంత సమయం ఇవ్వాలి. అయితే అతను రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్న తీరు రాజకీయ ప్రయోజనాల కోసం కాక మనసులో నుంచి వస్తున్నట్లుంటాయి. 

ప్రశ్న: రాహుల్ ఇప్పటికే చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నారు కదా..ఇంకా ఎంత కాలం అతనికి గడువు ఇవ్వలంటారు?

షీలా దీక్షిత్: అవును. అతను ఇప్పటికే చాలా నేర్చుకొన్నాడు. కానీ ఇంకా ప్రధానమంత్రి కాలేదు. మున్ముందు అవుతాడు. రాహుల్ నిత్యం అనేక సభలు, సమావేశాలలో పాల్గొంటూ తన మనసులో ఆలోచనలను, అభిప్రాయాలను దాపరికం లేకుండా పైకి చెపుతుంటారు. దానిని కొందరు హర్షిస్తారు మరికొందరు విమర్శిస్తుంటారు. కానీ కాలక్రమంలో రాహుల్ అన్నీ నేర్చుకొంటాడు. 

ప్రశ్న: రాహుల్ పార్టీ పగ్గాలు ఎప్పుడు చేపడతారు? పార్టీలో ప్రియాంకా వాద్రా పాత్ర ఏమిటి?

షీలా దీక్షిత్: ఈవిషయం పార్టీలో చాలా కాలంగా నలుగుతోంది. పార్టీలో కొన్ని పదవులలో చిరకాలంగా కొందరు పాతుకుపోయారు. కనుక పార్టీలో సమూల ప్రక్షాళన జరుగవలసి ఉంది. బహుశః 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక రాహుల్ పార్టీ బాధ్యతలు స్వీకరించవచ్చు. ప్రియాంకా విషయంలో ఆమె స్వయంగా నిర్ణయించుకోవాలి. ఆమె, రాహుల్ ఇద్దరూ కలిపి పార్టీని నడిపిస్తే బాగుంటుందని నేను అనుకొంటున్నాను.

ప్రశ్న: సహారా డైరీల గురించి మీ అభిప్రాయం ఏమిటి?

షీలా దీక్షిత్: ప్రధాని నరేంద్ర మోడీని దెబ్బ తీయడానికే ఆ డైరీని వెలుగులోకి తీసుకువచ్చినప్పటికీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొందరు సహచరులు కూడా దాని వలన ఇబ్బంది పడతారని గుర్తించకుండా దాని గురించి మాట్లాడటం తప్పు అని నేను భావిస్తున్నాను. (ఆ డెయిరీలో షీలా దీక్షిత్ కూడా సహారా గ్రూప్ నుంచి ముడుపులు తీసుకొన్నట్లు పేర్కొనబడింది. కానీ రాహుల్ గాంధీ ఆ సంగతి గమనించకుండా ఆ సహారా డైరీ జాబితాను మీడియాకి అందజేసేశారు.) 


Related Post