తెదేపా పాదయాత్రను అడ్డుకోవడం ఎందుకు?

February 24, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే పాదయాత్రలు, ధర్నాలు చేస్తున్నాయని, వచ్చే ఎన్నికలలో అవన్నీ అడ్రస్ లేకుండా పోతాయని తెరాస మంత్రులు వాదిస్తుంటారు. మళ్ళీ వాటి పాదయాత్రలు, ధర్నాలు, ర్యాలీలపై తెరాస నేతలు చాలా తీవ్రంగా స్పందిస్తుంటారు. ప్రభుత్వం కూడా వాటిని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తుంటుంది. 

మొన్న టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగర్యాలీని అడ్డుకోవడం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మళ్ళీ నిన్న (గురువారం) వరంగల్ జిల్లాలో తెదేపా పాదయాత్రను కూడా పోలీసులు అడుగడుగునా అడ్డుకొన్నారు. వారు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతులతో మాట్లాడేందుకు వచ్చినప్పుడు వారిని లోపలకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకొన్నారు. కొంతసేపు వాదోపవాదాలు జరిగిన తరువాత తెదేపా నేతలను లోపలకి అనుమతించారు. తరువాత తెదేపా నేతలు అక్కడి నుండి పాదయాత్ర చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరగా మళ్ళీ పోలీసులు వారిని హన్మకొండ అశోకా హాల్ వద్ద ముందుకు వెళ్ళకుండా అడ్డుకొన్నారు. దానితో వారు వేరే మార్గంగా గుండా కలెక్టర్ కార్యాలయం చేరుకొని ఆయనకు విజ్ఞప్తి పత్రం అందించి వెళ్ళారు. 

తెదేపా నేతలు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాలని ప్రయత్నించడం ఏవిధంగాను నేరమూ కాదు చట్ట వ్యతిరేకమైనది కాదు. ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వమని మంత్రులు హరీష్ రావు, కేటిఆర్, ఎంపి కవిత పదేపదే కోరుతుంటారు. మరి తెదేపా నేతలు చేస్తున్న పని అదే కదా? మరి వారిని ఎందుకు అడ్డుకొంటున్నట్లు? ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావలసిన బాధ్యత ప్రతిపక్షాలది. ఆ సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. 

ప్రతిపక్షాల పాదయాత్రలకు కారణాలు, ఉద్దేశ్యాలు ఏవైతేనేమి, ప్రభుత్వం దృష్టికి రాని విషయాలను అవి దాని దృష్టికి తెచ్చి దాని పని సులువు చేస్తున్నప్పుడు వాటిని స్వాగతించకపోగా వాటిని చూసి భయపడటం దేనికి? పోలీసుల చేత వారిని అడ్డుకోవడం దేనికి?ఇటువంటి చర్యలు తెరాస సర్కార్ లో నెలకొన్న అభద్రతాభావాన్ని, నిరంకుశధోరణికి అద్దం పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


Related Post