ఏపిని తాకిన నిరుద్యోగ సెగ

February 23, 2017


img

టిజెఎసి నిరుద్యోగ ర్యాలీ ప్రభావం ఏపిపై కూడా పడినట్లే ఉంది. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఏపి సిఎం చంద్రబాబుకు నిన్న ఒక బహిరంగ లేఖ వ్రాశారు. తెదేపా అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం లేకుంటే నెలకు రూ.2,000 నిరుద్యోగ భ్రుతి చెల్లిస్తానని 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఇంతవరకు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు కనుక రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 75 లక్షల కుటుంబాలకు నెలకు రూ.2,000 చొప్పున ఈ 33 నెలలకు కలిపి రూ. 1.15 లక్షల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. దాని కోసం 2017-18 రాష్ట్ర బడ్జెట్ లో నిధులు (రూ. 1.15 లక్షల కోట్లు) కేటాయించాలని జగన్ డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే ఉద్యమిస్తానని లేఖలో హెచ్చరించారు.

జగన్ చేసిన ఈ డిమాండ్ పై మంత్రి అయ్యన్న పాత్రుడు చాలా ఘాటుగా స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం కలిపి రూ. 1.30 లక్షల కోట్లు ఉంటే దానిలో రూ. 1.15 లక్షల కోట్లు నిరుద్యోగ పెన్షన్లకు కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి తప్ప మరెవరూ అడగలేరని మంత్రి అన్నారు. ఇటువంటి ప్రతిపక్ష నేత ఉండటం దురద్రుష్టకరమని అన్నారు. ఈ పేరుతో నిరుద్యోగులను జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

జగన్ డిమాండ్ అర్ధం లేనిదని మంత్రి కొట్టిపడేసి తప్పించుకొన్నారు తప్ప 33 నెలలు గడిచిపోయినా ఇంతవరకు ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోతే కుటుంబానికి రూ.2,000 చొప్పున నిరుద్యోగ భ్రుతి ఎందుకు చెల్లించలేదు? అనే జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఇప్పుడు జగన్ ప్రశ్నకు తెదేపా ప్రభుత్వం జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేసి తప్పించుకోవచ్చు కానీ వచ్చే ఎన్నికలలో జగన్ ఇదే ప్రశ్నను రామబాణంలాగ సందిస్తే తెదేపా తప్పించుకోలేదు. ఎందుకంటే 2014ఎన్నికలలో “జాబు రావాలంటే...బాబు రావాలి..జాబు వచ్చే వరకు ప్రతీ కుటుంబానికి నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భ్రుతి చెల్లిస్తామని” చంద్రబాబు నాయుడు, తెదేపా నేతలు చాలా గట్టిగా చెప్పారు. నేటికీ ఏపిలో గోడల మీద తెదేపా వ్రాసిన ఆ హామీలు కనిపిస్తూనే ఉంటాయి. 

చంద్రబాబు తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రజలను మోసగిస్తున్నారని జగన్ పదేపదే ఆరోపిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు నిరుద్యోగ భ్రుతి కోరుతూ జగన్ నిజంగానే ఉద్యమిస్తే చంద్రబాబు ప్రభుత్వానికి కొత్త కష్టాలు మొదలవవచ్చు. 


Related Post