ఏపితో స్నేహం సాధ్యమైతే కోదండరామ్ తో కాదా?

February 23, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెరాస సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తోందని ఖచ్చితంగా చెప్పవచ్చు. తెరాస సర్కార్ ను గట్టిగా వ్యతిరేకిస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఈవిషయంలో బహుశః ఏకీభవిస్తున్నట్లే భావించవచ్చు. ఎందుకంటే ఆయన కొన్ని హామీలను తెరాస సర్కార్ అమలుచేయడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎన్నడూ దాని చిత్తశుద్ధిని శంఖించలేదు. 

అదేవిధంగా తెలంగాణా పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలు, తపన గురించి తెరాస నేతలకు కూడా తెలుసు. కానీ తమ ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శల వలన ప్రజలలో వ్యతిరేకత ఏర్పడితే రాజకీయంగా తాము నష్టపోతామనే భయంతోనే వారు ఆయనతో కత్తులు దూయక తప్పడం లేదు. 

ఇరుపక్షాలు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కోరుకొంటున్నప్పటికీ వారి ఆలోచనా విధానాలలో తేడా కారణంగానే విభేదిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. నిజానికి ఇది ఒక పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పవచ్చు. దానికి అహం అడ్డుగోడగా నిలుస్తున్నట్లు కనబడుతోంది. ఇరుపక్షాలు దానిని అధిగమించి కలిసికట్టుగా పనిచేయాలని ఆలోచించే బదులు ఒకరిపై ఒకరు ఈవిధంగా కత్తులు దూసుకోవడం వలన ఏమవుతుంది? అంటే ఇరువురి పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడవచ్చు లేదా వారిరువురి మద్య ప్రజలు చీలిపోవచ్చు. తెరాస సర్కార్, ప్రొఫెసర్  కోదండరామ్ చేస్తున్న పూర్తి భిన్నమైన వాదనలతో ఇప్పటికే ప్రజలలో కొంత చీలిక ఏర్పడిందని నిన్నటి పరిణామాలు నిరూపిస్తున్నాయి. కనుక ఇంకా ఇదే విధంగా కతులు దూసుకొంటే ప్రజలలో ఆ చీలిక ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలు అభివృద్ధిని కుంటుపరుస్తాయి. కనుక తెరాస, టిజెఎసి రెండూ కూడా తమ అహాన్ని, భేషజాలను పక్కనపెట్టి ఒక మెట్టు దిగి చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం.

 తెలంగాణా, ఆంధ్రాల మద్య అనేక వివాదాలు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ రెండు ప్రభుత్వాలు మంత్రుల కమిటీలు వేసుకొని గవర్నర్ సమక్షంలో కూర్చొని చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి అటువంటప్పుడు తెలంగాణా శ్రేయోభిలాషి ప్రొఫెసర్ కోదండరామ్ తో మాట్లాడటానికి తెరాస సర్కార్ కు కష్టం కాదు కదా. ఆయన లేవనెత్తుతున్న సమస్యలకు పరిష్కారాలు ఆయననే చెప్పమని కోరవచ్చు కదా?

అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీలను ఎంతవరకు అమలు చేసింది? వాటిని అమలు చేయాలనే చిత్తశుద్ధి దానికి ఉందా లేదా? ఉంటే వాటిని అమలుచేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తోంది? లేదా ఎందుకు విఫలం అవుతోంది? అని ఆలోచించి ప్రభుత్వానికి సహకారం అందించడం చాలా అవసరం. 

ఇంతవరకు పాలించిన పాలకులు కేవలం వారి స్వార్ధ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు తప్ప తెలంగాణా అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు రాష్ట్రాన్ని మనకు కావలసినట్లు అభివృద్ధి చేసుకొనే అవకాశం కలిగినప్పుడు ఈవిధంగా కీచులాడుకోవడం కూర్చొన్న కొమ్మను నరుకొన్నట్లవుతుందని అందరూ గ్రహించాలి. తెరాస, టిజెఎసి రెండూ కూడా తెలంగాణా శ్రేయస్సు కోరేవే. కనుక అందరూ చేతులు కలిపి నడవడమే విజ్ఞత అనిపించుకొంటుంది. 


Related Post