కోదండరామ్ వన్ మ్యాన్ షో చేస్తున్నారా?

February 23, 2017


img

నిరుద్యోగుల ర్యాలీకి అనుమతించే విషయంలో హైకోర్టు తన నిర్ణయం ప్రకటించక మునుపే, టిజెఎసి తన పిటిషన్ ఉపసహరించుకొన్నందుకు టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ను కొందరు తప్పు పడుతున్నారు. కానీ తాము ర్యాలీ, ధర్నా చేసే ఆలచనలను విరమించుకొని న్యాయస్థానం విధించిన షరతులన్నిటికీ ఒప్పుకొని కనీసం నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో సభ జరుపుకోవడానికైనా అనుమతి ఇవ్వమని కోరామని, కానీ నగరశివార్లలో నాగోల్ లోనే నిర్వహించుకోవాలని కోర్టు గట్టిగా చెపుతున్నందునే తమ పిటిషన్ ఉపసంహరించుకోవలసి వచ్చిందని ప్రొఫెసర్ కోదండరామ్ వివరణ ఇచ్చారు. కానీ ఆయన వివరణతో సంతృప్తి చెందని జెఎసి కన్వీనర్ పిట్టల రవీందర్ ఈరోజు కోదండరామ్ నివాసంలో జరిగిన టిజెఎసి సమావేశాన్ని బహిష్కరించి వెళ్ళిపోయారు. 

రవీందర్ మీడియాతో మాట్లాడుతూ, “నిన్న జరిగిన వ్యవహారంలో కోదండరామ్ పూర్తిగా వన్ మ్యాన్ షోలాగ నడిపించారు. ప్రజల మద్దతుతో సాగవలసిన ఈ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీల మద్దతుతో నడిపించడం సరికాదు. జెఎసి కార్యక్రమాలకు ప్రజల మద్దతే అవసరం కానీ రాజకీయ పార్టీల మద్దతు కాదు. హైకోర్టు సూచించినట్లు నాగోల్ లో సభ నిర్వహించుకొని ఉండి ఉంటే మన ఆశయం నెరవేరి ఉండేది కదా?” అని విమర్శించారు. 

నిన్న జరుగవలసిన నిరుద్యోగ ర్యాలీ కోసం పిట్టల రవీందర్ గత కొన్ని వారాలుగా చాలా కష్టపడ్డారు. కానీ అసలు ర్యాలీయే జరుగకపోవడం, కోర్టు నిర్ణయం ప్రకటించక మునుపే పిటిషన్ ఉపసంహరించుకోవడంతో రవీందర్ చాలా ఆవేదన చెందినట్లున్నారు. ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ పై ఈ విమర్శలు చేయగానే, “జెఎసిలో లుకలుకలు” అంటూ పెద్ద హెడ్డింగులతో మీడియా ఊహాగానాలు మొదలుపెట్టేసింది. కనుక పిట్టల రవీందర్ జెఎసి పట్ల తన వైఖరిని మళ్ళీ మరోమారు స్పష్టం చేయవలసిన అవసరం ఉంది.


Related Post