అప్పుడు కొడుకు...ఇప్పుడు తల్లి శలవు చీటీ

February 23, 2017


img

ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా శలవులు ఉంటాయేమో కానీ రాజకీయాలకు ఉండవు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఉంటాయి. సుమారు రెండేళ్ళ క్రితం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి శలవు పెట్టి మూడు నెలలు విదేశాలలో తిరిగివచ్చారు. అందరూ వెళతారు కదా..అంటే అది వేరు ఇది వేరు. తనకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించనందుకు అమ్మపై అలిగి శలవుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. 

ఇప్పుడు అమ్మ (సోనియా గాంధీ) కొన్ని కారణాల చేత తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నానని తెలియజేస్తూ అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గ ప్రజలకు నిన్న ఒక శలవు చీటీని  పంపారు. తన కొడుకు రాహుల్ గాంధీ మాటనే తన మాటగా భావించి ప్రస్తుతం జరుగుతున్న యుపి ఎన్నికలలో తమ పార్టీకే ఓటువేయాలని ఆ చీటీలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకొని కొన్ని కార్పోరేట్ సంస్థలకు దోచిపెడుతోందని, అది వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని కనుక కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని సోనియా గాంధీ తన శలవు చీటీలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

సోనియా గాంధీ అనారోగ్య కారణంగానే శలవు తీసుకొన్నారనేది బహిరంగ రహస్యం. అందుకే ఆమె కాంగ్రెస్ పార్టీకి, తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీ భవిష్యత్ కు చాలా కీలకమైన ఈ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారానికి హాజరుకాలేకపోతున్నారు. తనకి ఓపిక ఉన్నా లేకపోయినా రాజకీయాలలో తాను చురుకుగా ఉన్నంతకాలం కొడుకు తన కొంగు పట్టుకొనే తిరుగుతాడని సోనియా గాంధీ గ్రహించినట్లే ఉన్నారు. బహుశః అందుకే శలవు పెట్టేశారేమో? 

ఇప్పుడు పక్కన అమ్మ లేదు కనుక అక్క ప్రియాంక కొంగు, అఖిలేష్ యాదవ్ చెయ్యి పట్టుకొని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్- సమాజ్ వాదీ కూటమి విజయం సాధించినట్లయితే, దానిని రాహుల్ పద్దులో వ్రాసేసి వెంటనే ఆయనకు పట్టాభిషేకం చేసేయవచ్చు. ఒకవేళ ఓడిపోతే అది సమాజ్ వాదీ వైఫల్యమే అవుతుంది తప్ప రాహుల్ ది కాదు. కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లేదా మణిపూర్ లో గెలిచినా చాలు..రాహుల్ పట్టాభిషేకం చేసేసుకోవచ్చు.


Related Post