తెలంగాణాలో డ్రైపోర్టుల ఏర్పాటుకు రంగం సిద్దం

February 20, 2017


img

మన దేశంలో వివిధ రాష్ట్రాలలో 170 డ్రైపోర్టులున్నాయి. కేంద్రప్రభుత్వం కొత్తగా మరో 70 ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. వాటిలో 4 తెలంగాణా రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. కేంద్రప్రభుత్వం సూచన మేరకు తెరాస సర్కార్ రాష్ట్రంలో నాలుగు డ్రైపోర్టుల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టి వాటి కోసం సమగ్ర నివేదికలు సిద్దం చేసింది. రాష్ట్రంలో భువనగిరి, జహీరాబాద్, జడ్చర్ల, దామరచర్లలో ఈ డ్రైపోర్టులను నిర్మించడానికి కసరత్తు ప్రారంభించింది. 

సాధారణంగా సముద్రతీరం లేని చోట్ల చాల బారీ స్థాయిలో సరుకు నిలువ, రవాణా కోసం ఈ డ్రైపోర్టులను ఏర్పాటు చేస్తుంటారు. సాధారణంగా వీటిని జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సమీపంలోనే ఏర్పాటు చేస్తారు. అంతే కాక అవకాశం,అవసరం ఉన్నట్లయితే వాటిని సమీపంలోని ఓడరేవులతో అనుసంధానిస్తారు. ఒక్కోటి 70-80 ఎకరాలలో నిర్మించబడే ఈ డ్రైపోర్టులలో చాలా బారీ గోదాములు, సరుకు రవాణా కోసం అవసరమైన అన్ని అత్యాధునిక వ్యవస్థలు, సదుపాయాలూ కల్పిస్తారు.

తెలంగాణా రాష్ట్రంలో  భువనగిరి సమీపంలో గల నాగులాపల్లి వద్ద 80 ఎకరాలలో ఒక డ్రైపోర్టు, జహీరాబాద్ లో నీమ్స్ సమీపంలో 65వ జాతీయ రహదారిని అనుకొని ఒకటి, ఖమ్మం జిల్లాలోని దామరచర్ల వద్ద ఒకటి, మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లలో వద్ద ఒకటి డ్రైపోర్టును ఏర్పాటు చేయడానికి తెరాస సర్కార్ భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. మున్ముందు దామరచర్ల పోర్టుని విస్తరించి సత్తుపల్లిలో కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది.   

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జాయింట్ వెంచర్ గా ఈ డ్రైపోర్టుల నిర్మాణాన్ని చేపడతాయి. కానీ వీటిలో కేంద్రప్రభుత్వ వాటాయే ఎక్కువగా ఉంటుంది. కేంద్రప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేయగానే తెరాస సర్కార్ నిర్మాణపనులకు టెండర్లు పిలుస్తుంది. మరొక 3-4 నెలలలోపుగానే ఈ ప్రక్రియ పూర్తయ్యి నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశాలున్నాయి.

వీటిలో ఎక్కువగా ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, వెల్డర్స్, వెహికల్ మెకానిక్స్,  లైట్ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్స్, స్టోర్ కీపర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, సెక్యూరిటీ, స్వీపర్స్, వంటవాళ్లు మొదలైనవారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్లానింగ్, సివిల్, ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ నిపుణులకు అవకాశాలు ఉంటాయి. కనుక ఈ డ్రైపోర్టులు ఏర్పాటు అయితే రాష్ట్రానికి ఆదాయం బారీగా పెరగడమే కాకుండా అనేకవందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.



Related Post