తమిళ సినిమాకి క్లైమాక్సా..సీక్వెలా?

February 18, 2017


img

జయలలిత ఆకస్మిక మరణం తరువాత అన్నాడిఎంకె పార్టీలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గానికి మద్య జరుగుతున్న ఆధిపత్యపోరు ఒక సస్పెన్స్ సినిమాలాగే కొనసాగుతోంది. శశికళ జైలుకి వెళ్ళడంతో దానికి ముగింపు వచ్చిందనుకొంటే, పళనిస్వామి ఎంట్రీతో మళ్ళీ దానిలో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఇక ఈ తమిళ సినిమా పూర్తయిందనుకొంటే ఇవ్వాళ్ళ రాష్ట్ర శాసనసభలో జరుగబోతున్న బలపరీక్ష కారణంగా మళ్ళీ కొత్త ట్విస్ట్ వచ్చింది. పళనిస్వామికి మద్దతు ఇస్తున్నవారిలో కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా ఓటువేసే అవకాశం ఉందనే వార్తలు అందరిలో ఉత్కంట కలిగిస్తున్నాయి. 

ఇక ప్రతిపక్ష డిఎంకె, కాంగ్రెస్ పార్టీలు పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నట్లు ప్రకటించేశాయి. కనుక పళనిస్వామికి మద్దతు ఇస్తున్న వారిలో 10 మంది పన్నీర్ సెల్వంవైపు ఫిరాయించినట్లయితే, 8మంది సభ్యులున్న కాంగ్రెస్ మద్దతు లభించే అవకాశం కూడా లేదని స్పష్టం అయిపోయింది. కనుక తనకు మద్దతు ఇస్తున్న 123మంది ఎమ్మెల్యేలకు నయాన్నో, భయన్నో నచ్చజెప్పి కాపాడుకోవడం చాలా అవసరం. గోల్డెన్ రిసార్టులో అందరికీ బ్రెయిన్ వాష్ గట్టిగా చేసిన తరువాతే వారిని శాసనసభకు తరలిస్తున్నారని సమాచారం. కానీ చివరి నిమిషం వరకు ఏమి జరుగుతుందో..ఎవరు ఎటువైపు దూకేస్తారో ఎవరూ ఊహించలేకపోతున్నారు. మంచి బలమైన స్క్రీన్ ప్లేతో తీసినట్లుగా సాగుతున్న ఈ తమిళ సినిమాలో చివరి క్షణం వరకు కూడా సస్పన్స్ కొనసాగుతూనే ఉంది. అన్ని పార్టీల సభ్యులు శాసనసభకు చేరుకొంటున్నారు. మరి కాసేపట్లో బలనిరూపణ పరీక్ష మొదలవుతుంది. అది ఈ తమిళ సినిమాకి క్లైమాక్స్ అవుతుందో లేక దానితో మరో సీక్వెల్ మొదలవుతుందో చూడాలి. 

మొత్తం శాసనసభ్యుల సంఖ్య :234

ప్రభుత్వం నిలబడేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్: 117

పళనిస్వామికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య: 123

పన్నీర్ సెల్వంకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య: 11

డిఎంకె సభ్యులు: 89 (పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు).

కాంగ్రెస్ సభ్యులు: 8 (పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు).

ఐయూఎంఎల్‌ సభ్యుడు: 1 (?)

స్పీకర్ తటస్థంగా ఉంటారు.


Related Post