కాంగ్రెస్ ఓటమి దానికే సాధ్యం

February 18, 2017


img

కాంగ్రెస్ పార్టీని బయటవారు ఎవరూ ఎన్నడూ ఓడించలేరని, తనను తాను ఓడించుకొన్నప్పుడే వేరే పార్టీలకు  అధికారం దక్కుతుంటుందని కాంగ్రెస్ నేతలే గర్వంగా చెప్పుకొంటుంటారు. ఈ సూత్రం అన్ని పార్టీలకు కూడా వర్తింపజేయవచ్చు కానీ దానిపై పేటెంట్ హక్కులు మాత్రం కాంగ్రెస్ పార్టీకే స్వంతం. కాంగ్రెస్ పార్టీకి సమైక్య రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో ప్రజలు రెండుసార్లు వరుసగా అధికారం కట్టబెడితే, అవినీతి, అసమర్థత, కుమ్ములాటలతో అది కూర్చొన్న కొమ్మనే నరుక్కొని క్రిందపడింది. అయినా దాని తీరులో వీసమెత్తు మార్పు కనబడకపోవడం దాని తప్పు కాదు. కాంగ్రెస్ రక్తంలోనే ఈ అవలక్షణాలు అన్నీ కలగలిసిపోయున్నాయి కనుక వాటిని కాంగ్రెస్ నుంచి వేరు చేయడం అసాధ్యం. అందుకే రాష్ట్రంలో ఓడిపోయి తుడిచిపెట్టుకుపోతున్నా టీ-కాంగ్రెస్ నేతలు యధాప్రకారం కుమ్ములాడుకొంటూనే ఉన్నారు. అందుకు తాజా ఉదాహరణ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులకు మద్య జరుగుతున్న కీచులాటలే. 

 రాష్ట్రంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి అందరినీ వచ్చే ఎన్నికలకు సన్నధం చేయవలసిన ఉత్తం కుమార్ రెడ్డి, వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలిచే అవకాశాలు లేవన్నట్లుగా మాట్లాడటం విశేషం. ఆయన ఇటీవల ఒక సర్వే చేయించి వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 55 సీట్లు మాత్రమే గెలుచుకొంటుందని, మరో 26 సీట్లలో తెరాస నుంచి గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుందని ప్రకటించారు. అది వాస్తవమే కావచ్చు కానీ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే అటువంటి విషయాలను బయటపెట్టడం సరికాదని చెప్పవచ్చు.

 అందుకే కోమటిరెడ్డి వెంకట రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ లో ఆయన నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “టిపిసిసి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి చెప్పవలసిన మాటలు కావవి. వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించుకొనేందుకు అందరినీ కలుపుకొనిపోతూ తెరాస సర్కార్ పై గట్టిగా పోరాడటంమాని గెడ్డాలు, మీసాలు పెంచుతున్నారు. వాటితో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఆయన గ్రహిస్తే మంచిది. తప్పుడు సర్వేలతో పార్టీ శ్రేణులని, అధిష్టానాన్ని కూడా అయన తప్పు ద్రోవ పట్టిస్తున్నారు. పార్టీకి శల్యసారధ్యం చేస్తున్న ఆయన వచ్చే ఎన్నికలలో కూడా తానే సారద్యం వహిస్తానని చెప్పుకోవడం ఇంకా విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటుంది,” అని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతల వాదోపవాదాలు చూస్తే, కాంగ్రెస్ ఓటమి గురించి పైన చెప్పుకొన్న మాట నిజమే అనిపిస్తుంది. 


Related Post