ఆంధ్రా శశికళ..ఒక్కరు కాదు అనేకమంది

February 17, 2017


img

ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనుకొన్న శశికళ అక్రమస్తుల కేసులో అకస్మాత్తుగా జైలుకు వెళ్ళవలసిరావడంతో ఆ కేసు గురించి ఆంధ్రాలో తెదేపా-వైకాపాల మద్య చాలా వాదోపవాదాలే సాగుతున్నాయి. రూ.66 కోట్లు అవినీతికి పాల్పడిన శశికళకు 4 ఏళ్ళు జైలు శిక్ష పడితే లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డికి ఎంత పడాలని ఏపి సిఎం చంద్రబాబు సందేహం వ్యక్తం చేశారు. జగన్ కూడా శశికళలాగే అవినీతికి పాల్పడి అక్రమాస్తులు పోగు చేసుకొని ముఖ్యమంత్రి అయిపోవాలని తెగ ఆరాటపడిపోతున్నారు కనుక అతను కూడా ఏదో ఒకనాడు శశికళలాగే జైలుకి వెళ్ళడం ఖాయం అని అతను ఆంధ్రా శశికళ అని తెదేపా నేతలు వాదిస్తున్నారు.

తన అక్రమాస్తుల కేసులపై తెదేపా నేతలు చేస్తున్న ఆ ఆరోపణలపై వైకాపా నేతలు నేరుగా స్పందించకపోయినా, ఓటుకు నోటు కేసులో ఆడియోవీడియో సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడే ఆంధ్రా జయలలిత అని, ఆయన కుమారుడు నారా లోకేష్ ఆంధ్రా శశికళ అని వాదిస్తున్నారు. కానీ ‘జగన్ మళ్ళీ జైలుకు వెళ్ళడం ఖాయం’ అని తెదేపా నేతలు గట్టిగా వాదిస్తున్నట్లుగా జగన్ వాదించలేకపోతున్నారు. ఎందుకంటే ఓటుకు నోటు కేసు ఎప్పుడో అటకెక్కిపోయింది కనుక. 

కనుక చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బునంతా విదేశాలలో దాచుకొంటున్నారని అనే వాదనకే జగన్ పరిమితం కావలసివస్తోంది. ‘ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం నేను ముఖ్యమంత్రి అయిపోవడమే’ అని జగన్ ముగిస్తుంటారు. ఆయన ఆ మాట చెప్పిన ప్రతీసారి తెదేపా నేతలు వెంటనే అందుకొని ముఖ్యమంత్రి అవడం కాదు..శశికళలాగ జైలుకి వెళ్ళడం మాత్రం 100 శాతం ఖాయం అని వాదిస్తుంటారు. వారిరువురి వాదనల వలన తేలింది ఏమిటంటే తమిళనాడులో ఒక్క శశికళ మాత్రమే ఉంటే ఆంధ్రాలో చాలా మంది శశికళలు ఉన్నారని, వారందరూ తమ టైం (?) కోసం ఎదురు చూస్తున్నారని అర్ధం అవుతోంది. 


Related Post