అడ్డుకోవడం ఎందుకు..ఎవరైనా వస్తే కదా?

February 17, 2017


img

తెలంగాణా తెదేపా అద్వర్యంలో బుధవారం గజ్వేల్ లో నిర్వహించిన ప్రజాపోరు బహిరంగ సభను అడ్డుకొనేందుకు  తెరాస సర్కార్ విశ్వప్రయత్నాలు చేసిందని తెదేపా నేతలు ఆరోపణలు చేశారు. తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ వాటిపై స్పందిస్తూ తెదేపా నేతలకు చురకలు వేశారు. “ఆ సభను అడ్డుకోవలసిన అవసరం మాకేమిటి? అసలు ఆ సభకు జనాలే రాలేదు. ప్రజలే తెదేపాను దూరం పెడుతున్నారని చెప్పడానికి అదే నిదర్శనం. ప్రజలు కూడా వారిని పట్టించుకోకపోవడంతో వారు మతి భ్రమించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికలలో మేము ఇచ్చిన హామీలలో 90శాతం మా ప్రభుత్వం అమలుచేసింది. రాష్ట్రంలో 2.6 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి టెండర్లు పిలిస్తే పనులు చేపట్టడానికి సిద్దం అవుతోంది. తెదేపా నేతలు తమ ఉనికిని చాటుకోనేందుకే మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వారికి తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేనట్లుంది. అందుకే అడుగడుగునా ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనికి అడ్డుతగులుతున్నారు. వారికి ప్రజలే తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని ప్రభాకర్ విమర్శించారు. 

ప్రభాకర్ స్వయంగా చెప్పిన మాటలను బట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే, సుమారు మూడేళ్ళు గడిచినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ హామీ ఇంకా టెండర్ల దశలోనే ఉందని! ఆ ప్రక్రియ ఇంకా ఎప్పటికి పూర్తవుతుందో, ఇంక ఆ ఇళ్ళ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతాయో, అవి అర్హులైన పేదప్రజల చేతికి ఎప్పుడు అందుతాయో ఎవరూ చెప్పలేరు. ఇక పంట రుణాల మాఫీ, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు, లక్ష ఉద్యోగాల భర్తీ, దళితులకు 3 ఎకరాల భూముల పంపిణీ, కేజీ టు పీజి వరకు ఉచిత విద్య వంటి అనేక హామీలు అమలు వివిధ దశలలో ఉన్నాయి. వాటిపై ప్రొఫెసర్ కోదండరామ్ వంటివారు కూడా తేవర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనుక ప్రతిపక్షాల విమర్శలను బలంగా త్రిప్పి కొట్టే ప్రయత్నం చేయడం కంటే, తమ హామీల అమలుకోసం ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తే మంచిదేమో?


Related Post