ఈ ప్రజల కోసమా మన సైనికుల బలిదానాలు?

February 15, 2017


img

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఉగ్రవాదులు చొరబడటం వారితో మన భద్రతాదళాలు హోరాహోరీ పోరాడి మట్టుపెట్టడం, ఆ ప్రయత్నంలో మన వీర జవాన్లు ప్రాణాలు కోల్పోతుండటం మనం నిత్యం వింటునే ఉన్నాము. కానీ అవి నిత్యకృత్యం అయిపోవడంతో ఎవరూ వాటిని కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశారు. కానీ మొన్న మంగళవారం సాయంత్రం కాశ్మీర్ లోని హంద్ వార్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులతో మన జవాన్లు హోరాహోరీగా పోరాడినప్పుడు, మేజర్ సతీష్ దాహియా తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతుంటే, స్థానిక ప్రజలు ఉగ్రవాదులకు రక్షణకవచంలాగ నిలబడి భద్రతాదళాలపై రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోవడానికి వారు సహకరిస్తున్నప్పటికీ ప్రజలపై కాల్పులు జరిపేందుకు అనుమతి లేనందున భద్రతాదళాలు తమ వాహనాలలో తిరుగు ముఖం పట్టవలసి వచ్చింది. స్థానిక ప్రజల దాడి కారణంగా గాయపడిన మేజర్ సతీష్ దాహియాను ఆసుపత్రికి తరలించడం చాలా కష్టమైంది. అతనిని వ్యానులో ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు కూడా స్థానిక ప్రజలు వారి వాహనాల వెంటపడి మరీ రాళ్ళు రువ్వారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సరికే మేజర్ సతీష్ దాహియా మరణించారు. 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఏటా కొన్ని వేలకోట్లు కేంద్రప్రభుత్వం అందిస్తుంటుంది. ఆ రాష్ట్రంలో వరదలు వస్తే ఆ వీర జవాన్లే వెళ్ళి రక్షిస్తారు. వేర్పాటువాదులు పాఠశాలలు తగులబెడుతుంటే ఆ జవాన్లే వెళ్ళి వాటిని కాపాడుతుంటారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారిని ముందుగా ఆదుకొనేది ఆ జవాన్లే తప్ప వేర్పాటువాదులు కాదు ఉగ్రవాదులు కాదు కేంద్రప్రభుత్వం కూడా కాదు. అటువంటి జవాన్లపై ప్రాణాలు పోతున్నా కూడా కాశ్మీరీ ప్రజలకు ఉగ్రవాదులను కాపాడటమే ముఖ్యం అయిపోయింది. ఏ ఉగ్రవాదుల నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రజలను కాపాడాలని మన జవాన్లు ప్రయత్నిస్తున్నారో, ఆ ఉగ్రవాదులకే ప్రజలు అండగా నిలబడటమె కాకుండా తమ కోసం పోరాడుతున్న మన సైనికులపై రాళ్ళతో దాడులు చేయడం చూస్తుంటే, వీరి కోసమేనా మన వీర జవాన్లు తమ ప్రాణాలు బలి చేసుకొంటున్నారు? వీరి కోసమేనా తమ కుటుంబాలను అనాధలు చేసి రోడ్డున పడేస్తున్నారు? అని బాధ కలుగకమానదు.



Related Post